అతిథిలా వచ్చి.. అదును చూసి చోరీ
లబ్బీపేట(విజయవాడతూర్పు): చేతులకు పెద్ద ఉంగరాలు.. మెడలో గోల్డ్ చైన్, చేతికి ఖరీదైన వాచ్ పెట్టుకుని అతిథిలా పెళ్లిళ్లకు వస్తాడు.. ముందు వరుసలో కూర్చొని సమీప బంధువులా వ్యవహరిస్తాడు.. పెళ్లి తంతులో ఎవరి హడావుడిలో వారు ఉండగా, అదును చూసి మండపంలో దొరికిన బంగారు, వెండి ఆభరణాలను కాజేసి వెళ్లిపోతాడు. ఇలా నగరంలోని రెండు కల్యాణ మండపాల్లో చోరీలకు పాల్పడగా, విజయవాడ పోలీసులు టెక్నాలజీని ఉపయోగించి, మండపంలో ఉన్న అతని ఫొటోనే ఇతర పోర్టల్స్‌తో సరిపోల్చడం ద్వారా గుర్తించగలిగారు. దీంతో అతన్ని అరెస్ట్ చేసి చోరీ సొత్తును రికవరీ చేశారు.
పూర్తి వివరాలు ఇవి..
మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో గత ఏడాది నవంబర్ 7న ఒక వివాహ వేడుకలో రెండు వెండి బిందెలు చోరీకి గురయ్యాయి. దీనిపై పెళ్లికి సంబంధించిన వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, రంగంలోకి దిగిన పోలీసులు ఒక నిందితుడు అతిథి రూపంలో పెళ్లికి వచ్చి అక్కడ ఉన్న రెండు వెండి బిందెలను అపహరించినట్లు అక్కడ ఉన్న సీసీ టీవీల్లో రికార్డు అయి ఉంది. దీంతో అతని ఫొటోను సేకరించిన పోలీసులు దానిని నాట్ గ్రిడ్ అనే పోర్టల్‌లో చెక్ చేశారు. ఆ ఫొటో సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) వారి డాటా బేస్‌లో ఉన్న తెనాలికి చెందిన నార్ల ధర్మేంద్ర(46)కు చెందినదిగా గుర్తించారు. దీంతో విజయవాడ పోలీసులు తెనాలిలోని ధర్మేంద్రను అరెస్టు చేసి అతని వద్ద నుంచి రెండు వెండి బిందెలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా 2022లో కృష్ణలంక పోలీసు స్టేషన్ పరిధిలోని ఎ కన్వెన్షన్ సెంటర్‌లో ఇదే నిందితుడు 91 గ్రాముల బంగారు ఆభరణాలను తస్కరించినట్లు పోలీసులు నిర్ధారించారు. చోరీకి గురైన బంగారంలో 61 గ్రాములను అతని నుంచి రికవరీ చేశారు.
పోలీసు సిబ్బందికి ముగిసిన మూడు రోజుల శిక్షణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): సైబర్‌నేరాలు, సోషల్ మీడియా కేసులను త్వరితగతిన ఛేదించడంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ బుధవారం ముగిసింది. ఈ శిక్షణలో జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్‌ల అధికారులు, సైబర్ క్రైమ్ సిబ్బంది 130 మంది పాల్గొన్నారు. ఈ శిక్షణలో సైబర్ ఇంటిలిజెన్స్, డిజిటల్ ఫోరెన్సిక్ డైరెక్టర్ ప్రసాద్ పాటిబండ్ల, మనిషి యాదవ్, కృష్ణ కిరణ్, సంజయ్ కుమార్, కరుణాకర్ రెడ్డి, శివ కుమార్, ప్రసన్న లక్ష్మి పలు అంశాలపై శిక్షణ ఇవ్వగా, వారిని సీపీ రాజశేఖరబాబు సత్కరించారు.
టెక్నాలజీ సాయంతో నిందితుడిని
గుర్తించిన పోలీసులు


