సమర్థంగా తుపాను భద్రత ఏర్పాట్లు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): మోంథా తుపాను ప్రభావ సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రయాణికుల భద్రత, సౌకర్యాల ఏర్పాట్లలో విజయవాడ డివిజన్ సమర్ధంగా పనిచేసిందని డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా తెలిపారు. కచ్చితమైన ప్రణాళికలతో తుపాను ప్రభావ సమయంలో రైళ్ల కార్యకలాపాలు, అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిబ్బంది, యంత్రాలతో 24 గంటలూ పర్యవేక్షణ చేపట్టినట్లు తెలిపారు. ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా తీర ప్రాంతాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉండటంతో న్యూ ఢిల్లీ నుంచి విశాఖపట్నం వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్ (20806) రైలును విజయవాడలో నిలిపివేశామన్నారు. అందులోని 329 మంది ప్రయాణికులను ప్లాట్‌ఫాం నంబర్ 1లోని వెయిటింగ్ హాల్‌కు సురక్షితంగా తరలించి వారికి రిఫ్రెష్‌మెంట్, సిట్టింగ్ సదుపాయం, ఆహారం తదితర ఏర్పాట్లు చేశామని చెప్పారు. అనంతరం ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా రైలు నంబర్ 17209లో 35మందిని, రైలు నంబర్ 18520లో 95 మందిని, రైలు నంబర్ 12840లో 10మందిని, రైలు నంబర్ 12718లో 189 మంది ప్రయాణికులను సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకు చేర్చినట్టు వివరించారు.
యంత్రాలు, మానవశక్తితో సత్ఫలితాలు
తుపాను ప్రభావాన్ని సమర్ధంగా ఎదుర్కొనేందుకు అవసరమైన యంత్రాలు, మానవ శక్తిని సమీకరించుకున్నామన్నారు. ఇందులో 25 ఎస్కవేటర్లు, అత్యవసర పరిస్థితిలో నీటి ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఇసుక బ్యాగులతో కూడిన 24 వ్యాగన్‌లు, బండరాళ్లతో నిండిన 24 వ్యాగన్‌లను సమస్యాత్మక ప్రాంతాలలో అందుబాటులో ఉంచామన్నారు. వీటితో పాటు 650 స్టీల్ క్రిబ్‌లు, 450 మంది కాంట్రాక్ట్ కార్మికులు, ట్రాక్‌ల పటిష్టతను పరిశీలించేందుకు 475 మంది ట్రాక్‌మెన్‌లను నియమించామన్నారు. అత్యవసర పరిస్థితి కోసం 2800 క్యూబిక్ మీటర్ల ఇసుక, 2500 క్యూబిక్ మీటర్ల బండరాళ్లు, 12 స్టీల్ ఎమర్జెన్సీ గిడ్డర్‌లు, 150 హ్యూమ్ పైపులను అవసరమైన ప్రదేశాలకు తరలించేందుకు సిద్ధం చేశామని చెప్పారు. అవసరమైన ప్రదేశాలకు తరలించేందుకు యంత్రాలతో కూడిన మానవశక్తి, 72 ట్రాక్ మిషన్‌లను సిద్ధంగా ఉంచామన్నారు.
నిరంతరం ఆర్‌పీఎఫ్ పర్యవేక్షణ
విజయవాడ డివిజన్ ఆర్‌పీఎఫ్ అధికారులు, సిబ్బంది డివిజన్ వ్యాప్తంగా 24 గంటలూ సీసీ టీవీ పర్యవేక్షిస్తూ ప్రయాణికుల భద్రతలో కీలకపాత్ర పోషించారని డీఆర్‌ఎం సోనాకియా చెప్పారు. రైళ్ల సమాచారం తెలుసుకునేందుకు ప్రధాన స్టేషన్‌లలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసి ప్రయాణికులకు మార్గనిర్దేశం చేస్తున్నామన్నారు.


