తుఫాన్‌పై వైద్య ఆరోగ్యశాఖ ముందస్తు చర్యలు
డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ జిల్లాలో 605 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు 24/7 పనిచేస్తాయి డీఎంహెచ్‌ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని
లబ్బీపేట(విజయవాడతూర్పు): మోంథా తుఫాన్ నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. పునరావాస కేంద్రాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంతో పాటు, విజయవాడలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లోనూ వైద్య సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. ఆమె సోమవారం నగరంలోని పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రోగ్రామ్ ఆఫీసర్లు, వైద్య అధికారులు, సూపర్‌వైజర్లు 24/7 మూడు షిఫ్ట్‌ల్లో విధులు నిర్వహిస్తారన్నారు. జిల్లాలో కాన్పుకు సిద్ధంగా ఉన్న గర్భిణులకు, మంచాన పడిన వ్యాధిగ్రస్తులకు, ప్రత్యేక వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ఆరోగ్య కేంద్రాలు, మండలాల వారీగా పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలతో 605 రాపిడ్ రెస్పాన్స్ టీం బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా స్థాయి నుంచి క్షేత్ర స్థాయిలో ఉన్న ఆరోగ్య సిబ్బంది వరకు నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి ప్రధాన కార్యాలయంతో అనుసంధానమై ఉంటారని తెలిపారు.


