ఆ సమయం...అమూల్యం
స్ట్రోక్ లక్షణాలు గుర్తించి వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి లక్షణాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరం తీవ్రమైన స్ట్రెస్ కారణంగా స్ట్రోక్‌కు గురవుతున్న యువత వత్తిడిని అధిగమించేందుకు యోగా, మెడిటేషన్, వ్యాయామం అవసరం అంటున్న వైద్యులు అక్టోబరు 29 వరల్డ్ స్ట్రోక్ డే
●వత్తిళ్లను అధిగమించేందుకు యోగా,
మెడిటేషన్ చేయాలి
●రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలి
●రక్తపోటు, మధుమేహంను
అదుపులో ఉంచుకోవాలి
●అధిక కొలస్ట్రాల్‌ను తగ్గించుకోవాలి
●ధూమపానం, ఆల్కాహాల్‌ను మానుకోవాలి
●ఒకసారి స్ట్రోక్ వచ్చిన వారు రెండోసారి
రాకుండా మందులు సక్రమంగా వాడాలి
●అవసరమైతే వైద్యుల సూచన మేరకు
రక్తం పలుచబడే మందులు వాడాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఒకప్పుడు యాబై ఏళ్లు దాటిన వారు బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురయ్యేవారు. ఇప్పుడు 20 ఏళ్లకే స్ట్రోక్(పక్షవాతం)కు గురవడం ఆందోళన కలిగించే అంశంగా వైద్యులు చెపుతున్నారు. అందుకు తీవ్రమైన వత్తిళ్లే(స్ట్రెస్) కారణం అంటున్నారు. విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ఇలా అన్ని రంగాల్లో యువత తీవ్రమైన స్ట్రెస్‌కు గురవుతున్నారు. ఒకవైపు మారిన జీవనశైలి, మరోవైపు విధుల్లో వత్తిళ్లు స్ట్రోక్‌కు కారణమవుతున్నాయి. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఏటా 6 వేల మందికి పైగా స్ట్రోక్ బారిన పడుతున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో ప్రపంచ స్ట్రోక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్ట్రోక్ లక్షణాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చింది. అందులో భాగంగా లక్షణాలు కనిపించిన తర్వాత ‘ప్రతి నిమిషం లెక్కించదగినదే’ అనే నినాదంతో ఈ ఏడాది అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
గోల్డెన్ అవర్ కీలకం
బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనిపించిన తర్వాత ప్రతి నిమిషం కీలకమైనదే. గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి చేరితే సీటీ స్కాన్ ద్వారా వైద్యులు ఏ రకమైన బ్రెయిన్ స్ట్రోక్ అనేది నిర్ధారిస్తారు. ఇస్కిమిక్ స్ట్రోక్(రక్తనాళాల్లో గడ్డలు)గా నిర్ధారించిన వారికి థ్రోంబలైజ్ ఇంజక్షన్ ఇస్తారు. అవసరమైతే 12 గంటల్లోపు క్యాథ్‌ల్యాబ్‌కు తీసుకెళ్లి రక్తనాళాల్లోని గడ్డలను తొలగిస్తారు. ఈ రకమైన చికిత్సతో స్ట్రోక్ వచ్చినా రోగికి వైకల్యం లేకుండా చూడగలుగుతున్నారు. ఆస్పత్రికి రావడంలో ఆలస్యం అయిన వారికి ఈ రకమైన చికిత్సలు చేసినా ప్రయోజనం ఉండదు. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యే వారిలో 85 శాతం ఇస్కిమిక్ స్ట్రోక్ కాగా, 15 శాతం హెమరైజ్డ్ స్ట్రోక్‌కు గురవుతున్నారు.
రిహాబిలేషన్...
●పక్షవాతం రోగుల్లో రిహాబిలేషన్ అనేది చాలా ముఖ్యం. కనీసం మూడు నుంచి ఆరు నెలల పాటు జాగ్రత్తగా ఉంటూ ఫిజియోథెరపీ లాంటివి చేయాలి.
●మాట రాని వారి కోసం స్పీచ్ థెరపీ చేయించాలి.
●ఒక్కసారి ఫిజియోథెరపీ సమయంలో నడవగలిగితే రోగిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
యువతలో పెరిగిన స్ట్రోక్ ముప్పు
ప్రస్తుతం యువత బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవడమే కాకుండా, మరణాలకు దారి తీయడం ఆందోళన కలిగించే అంశంగా చెపుతున్నారు.
●గాంధీనగర్‌కు చెందిన సంతోష్(25) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. విధుల్లో తీవ్రమైన వత్తిళ్లకు గురై, వారం రోజుల కిందట సడన్‌గా స్ట్రోక్ వచ్చి, కొన్ని గంటల వ్యవధిలోనే మృత్యువాత పడ్డాడు.
●లబ్బీపేటకు చెందిన 26 ఏళ్ల ఇర్ఫాన్ ప్రయివేటు ఉద్యోగి. ఒకరోజు ఉదయం సడన్‌గా చేయి పైకి ఎత్తలేక పోవడం, మూతి వంకరగా మారడాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే సమీపంలోని స్ట్రోక్ యూనిట్‌కు తరలించగా, అక్కడ సత్వరమే చికిత్స అందించడంతో ఎలాంటి వైకల్యం రాకుండా కోలుకున్నాడు.
తీసుకోవలసిన జాగ్రత్తలు...


