ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్
నారాయణ స్కూల్‌లో యథావిధిగా తరగతుల నిర్వహణ
పెనమలూరు: ఊరందరిదీ ఓ దారి... ఉలిపి కట్టెది మరో దారి అన్నట్టుంది నారాయణ విద్యా సంస్థల తీరు. తీవ్ర తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు మూడు రోజులు సెలవు ఇవ్వాలని కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను కానూరు నారాయణ పాఠశాల బేఖాతర్ చేసింది. విద్యాసంస్థలకు 27 నుంచి 29వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించగా పెనమలూరు మండల పరిధిలోని 35 ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ప్రైవేటు పాఠశాలలు కూడా ఇదే పాటించాయి. అయితే మంత్రి నారాయణకు చెందిన కానూరులోని నారాయణ కెనడీ పాఠశాల నిర్వాహకులు మాత్రం ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కారు. సోమవారం విద్యార్థులకు యథావిధిగా తరగతులు నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న ఎంపీవోలు శేషగిరిరావు, కనకమహాలక్ష్మి పాఠశాలను తనిఖీ చేశారు. 6 నుంచి 10వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదని ప్రిన్సిపాల్‌ను నిలదీశారు. పాఠశాలకు వెంటనే సెలవు ఇప్పించారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. విద్యార్థుల భద్రతను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా తరగతులు నిర్వహించటంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నారాయణ పాఠశాలపై ఫిర్యాదు చేశామని ఎంఈవో శేషగిరిరావు చెప్పారు. ప్రైవేటు పాఠశాలలు సెలవులు అమలు చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


