మార్చిలో ఏపీ టెన్నిస్ బాల్ క్రికెట్ లీగ్ పోటీలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు):వచ్చే ఏడాది మార్చిలో తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెన్నిస్ బాల్ క్రికెట్ లీగ్ పోటీలు నిర్వహించనున్నామని ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్‌డీ ప్రసాద్ చెప్పారు. నగరంలోని హోటల్‌లో ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం ఆదివారం జరిగింది. అనంతరం ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ... టెన్సిస్ బాల్‌తో క్రికెట్ ఆడే క్రీడాకారుల్లోని ప్రతిభను ప్రోత్సహించడమే కాకుండా వారికి ఆర్థికంగా అండగా ఉండేందుకు ఈ లీగ్‌ను నిర్వహిస్తున్నామని చెప్పారు. మార్చిలో 12 రోజుల పాటు జరిగే ఈ క్రికెట్ లీగ్ పోటీల్లో విజేతలకు సుమారు రూ.30 లక్షల విలువైన నగదు బహుమతులతో పాటుగా బెస్ట్ ప్లేయర్, బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్‌మెన్స్‌లకు బహుమతులు అందిస్తామని తెలిపారు. రానున్న కాలంలో టెన్నిస్ బాల్ క్రికెట్‌కు ఆదరణ వచ్చేలా తమ అసోసియేషన్ చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఐకాన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రెడ్డి మాట్లాడుతూ మార్చిలో జరిగే లీగ్ పోటీల్లో టెన్నిల్ బాల్ క్రికెట్ పోటీల్లో క్రీడాకారులు పాల్గొని వారిలోని ఉన్న ప్రతిభను మెరుగుపర్చుకోవచ్చని వెల్లడించారు. ఈ లీగ్ పోటీలకు సంబంధించిన పూర్తి వివరాలను నవంబర్ 14వ తేదీన విడుదల చేస్తామన్నారు. రాధా రంగా మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు చెన్నుపాటి శ్రీనివాస్ అతిథిగా హాజరై టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలకు సంబంధించిన పాటను ఆవిష్కరించారు. కొండలరావు, కరుణాకర్‌తో పాటుగా సంఘం సభ్యులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.


