సంఖ్యలు.. ప్రమాద సంకేతాలు!
సాక్షి నెట్‌వర్క్: తీరప్రాంత గ్రామాల్లోని మత్స్యకారులకు తుఫాన్ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ప్రతి ఏటా తీర ప్రాంత జనం తుఫాన్ ప్రభావాలకు లోనవుతున్నారు. మోంథా తుఫాన్ నేపథ్యంలో హెచ్చరిక సంఖ్యలు, వాటి తీవ్రతలు గురించి తెలుసుకుందాం. తుఫాన్ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో వాతావరణ శాఖ మత్స్యకారులకు సూచించే విధంగా తీరం ఒడ్డున ఉండే ఎత్తయిన భవనాలపై హెచ్చరికలు జారీ చేస్తుంటారు. తుఫాన్ ప్రభావాన్ని మత్య్సకారులకు తెలిపేందుకు చీరాల వాడరేవులో 10వ నంబర్ ప్రమాద హెచ్చరికను ఇప్పటివరకు మూడుసార్లు జారీ చేశారు. 10వ నంబర్ హెచ్చరిక అంటే ‘తీవ్రమైన వాతావరణం తుఫాన్‌గా రేవు మీదుగా గానీ, దగ్గరగా కానీ తీరాన్ని తాకును’ అనే అర్థం. అంటే ప్రమాదం భారీఎత్తున ఉన్నప్పుడే 10 నంబర్ హెచ్చరిక జారీ చేస్తారు. 11వ నంబర్ హెచ్చరికను జారీ చేస్తే ఎలాంటి వర్తమానాలు లేకుండా అంతా అతలాకుతలంగా మారుతుంది. ఇప్పటివరకు చీరాల రేవులో 11వ నంబర్ హెచ్చరికను జారీ చేయలేదు. చీరాల వాడరేవులో ఇప్పటివరకు 10వ నంబర్ ప్రమాద హెచ్చరికను కేవలం మూడు సార్లు మాత్రమే జారీ చేశారు. 2021లో వార్దా తుఫాన్‌కు ఒకసారి, 2012లో జల్ తుఫాను సమయంలో, 2010 లైలా తుఫాన్ సమయాల్లోనే హెచ్చరిక జారీ చేశారు. గతంలో వచ్చిన లైలా, జల్ తుఫాన్లు బీభత్సాన్ని సృష్టించాయి. ఈ తుఫాన్ల కారణంగా భయంకరమైన గాలులు, భారీ వర్షాలు ముంచెత్తడంతో పాటుగా రాకాసి అలలు తీరానికి సంభవించాయి. మత్స్యకారులు బోట్లు ధ్వంసం కాగా, వలలు రాకాసి అలల తాకిడికి సముద్ర గర్భంలో కలిసిపోయాయి. మత్స్యకారులకు రూ.లక్షల్లో, అన్నదాతలకు రూ.కోట్లలో నష్టాన్ని మిగిల్చాయి. తీరం కోతకు గురవ్వడంతో పాటుగా అనేక ప్రాంతాల్లో రహదారులు సైతం కొట్టుకుపోయాయి. ఎన్నో బ్రిడ్జిలు ముంపునకు గురయ్యాయి.
హెచ్చరిక సంఖ్య తీవ్రత
1 నంబర్ అక్కడ ఈదురు గాలి ఉన్న ప్రాంతం ఉన్నది. దానికి తోటు తుఫాను ఏర్పడవచ్చు.
2 నంబర్ తుఫాన్ ఏర్పడి ఉన్నది.
3 నంబర్ ఈదురుగాలులు రేవును తాకవచ్చు.
4 నంబర్ తుఫాన్ తాకినప్పటికి ప్రమాదం లేదు.
5 నంబర్ తీవ్రమైన వాతావరణ తుఫాన్‌గా మారి రేవును దాని మార్గమును ఎడమ పక్కన ఉండునట్లు తీరాన్ని తాకుతుంది.
6 నంబర్ తీవ్రమైన వాతావరణ తుఫాన్‌గా మారి రేవును దాని మార్గమును
కుడి పక్కన ఉండునట్లు తీరాన్ని తాకుతుంది.
7 నంబర్ తీవ్రమైన వాతావరణ తుఫాన్‌గా మారి రేవు మీదుగా గాని తీరాన్ని గాని తాకుతుంది.
8 నంబర్ తీవ్రమైన వాతావరణ తుఫాన్‌గా మారి రేవును దాని మార్గమును ఎడమ పక్కన
ఉండునట్లు తీరాన్ని తాకుతుంది.
9 నంబర్ తీవ్రమైన వాతావరణ తుఫాన్‌గా మారి రేవును దాని మార్గమును
కుడి పక్కన ఉండునట్లు తీరాన్ని తాకుతుంది.
10 నంబర్ తీవ్రమైన వాతావరణ తుఫాన్‌గా మారి రేవు మీదుగా గానీ దగ్గరగా గానీ తీరాన్ని తాకుతుంది.
11 నంబర్ తుఫాను ప్రమాదమైనది. వర్తమానాలు లేవు
సంఖ్యలు.. ప్రమాద సంకేతాలు!


