మత సామరస్యానికి ప్రతీక గ్యార్మీ
భవానీపురం(విజయవాడపశ్చిమ): ముస్లిం మైనార్టీలు దైవంగా భావించే మహమ్మద్ ప్రవక్త బోధించిన సన్మార్గంలో నడుచుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పశ్చిమ ఇన్‌చార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. భవానీపురం 40వ డివిజన్ పరిధిలోని అల్లుడిపేటలో స్టార్ నవ జవాన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన గ్యార్మీ పండుగ వేడుకల్లో వెలంపల్లి పాల్గొని ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కమిటీ ఏర్పాటు చేసిన విందు వడ్డించారు. ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్యార్మీ పండుగ మత సామరస్యానికి, ఐక్యతకు ప్రతీక అన్నారు. ఇతరులకు తోచినంతలో సహాయం చేయడం మానవ ధర్మం అన్నారు. ప్రతి ఒక్కరూ తాము సంపాదించిన దానిలో ఎంతో కొంత పేదలకు సాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో 40, 41వ డివిజన్ల కార్పొరేటర్లు యరడ్ల ఆంజనేయరెడ్డి, ఎండీ ఇర్ఫాన్, వక్ఫ్‌బోర్డ్ డైరెక్టర్ షేక్ ఖాజా తదితరులు పాల్గొన్నారు.
నందిగామ టౌన్:ప్రముఖ ఆడిటర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మద్దుకూరి సాయిబాబు తండ్రి ప్రభాకరరావు (56) ఆదివారం మృతి చెందారు. తన నివాసంలో మెట్లపై నుంచి ప్రమాదవశాత్తూ జారిపడి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న శాసనమండలి సభ్యుడు డాక్టర్ మొండితోక అరుణకుమార్ మృతదేహాన్ని సందర్శించి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అరుణకుమార్ మాట్లాడుతూ అనారోగ్యం నుంచి కోలుకుంటున్న ప్రభాకరరావు ఆకస్మిక మృతి చెందడం బాధాకరమన్నారు. అనంతరం సాయిబాబు, నరసింహారావుతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుడ్డి సత్యనారాయణ, పారుపల్లి హరిబాబు, షేక్ మున్నా,షేక్ యాకుబ్ అలీ, మంగళపూడి కోటి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మత సామరస్యానికి ప్రతీక గ్యార్మీ


