ప్రైవేటు బస్సు.. భద్రత తుస్సు | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటు బస్సు.. భద్రత తుస్సు

Oct 26 2025 6:57 AM | Updated on Oct 26 2025 6:57 AM

ప్రైవ

ప్రైవేటు బస్సు.. భద్రత తుస్సు

నిబంధనలు పాటించని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ సంస్థలు ఫిట్‌నెస్‌ లేకపోయినా రోడ్డెక్కుతున్న బస్సులు నామమాత్రపు తనిఖీలకే అధికారులు పరిమితం

అడ్డగోలు రేట్లు

ఆర్టీసీ బస్సులు నడపాలి

ఆర్టీఏ పర్యవేక్షణ లోపం

బస్టాండ్‌(విజయవాడపశ్చిమ): కొన్ని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల్లో ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. అవి మృత్యు శకటాలుగా మారి నిండు ప్రాణాలు బలితీసుకుంటున్నాయి. ట్రావెల్స్‌ యజమానులు పలువురు నిబంధనలు పాటించకుండా కాలం చెల్లిన బస్సులు నడుపుతున్నారు. ఫిట్‌నెస్‌ లేకపోయినా బస్సులు రోడ్లు ఎక్కుతున్నాయి. వాటిపై నిరంతరం నిఘా ఉంచాల్సిన రవాణా శాఖ అధికారులు నామ మాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారు. ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు నాలుగు రోజులు హడావిడి చేసి వదిలేస్తున్నారు. ఏడేళ్ల క్రితం కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు వద్ద జేసీ కుటుంబానికి చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. తాజాగా కర్నూలు వద్ద జరిగిన ప్రమాదంలో 20 మందిపైగా మృత్యువాత పడ్డారు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల్లో డొల్లతనం బయటపడింది.

ఉమ్మడి జిల్లాలో

500లకు పైగా బస్సులు

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులకు విజయవాడ రాజధానిగా మారింది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 500లకు పైగా ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి మరో 200 వరకు బస్సులు నగరం మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. విజయవాడ నుంచి హైదరాబాద్‌, విశాఖ, చైన్నె, బెంగళూరు వంటి ప్రాంతాలకు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. వేలాది మంది ప్రయాణికులు వాటిలో రాకపోకలు సాగిస్తుంటారు. ప్రత్యేకించి సంక్రాంతి, దసరా, దీపావళి వంటి పండుగలతో పాటు వీకెండ్‌లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. అయితే ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో మూడొంతులు పర్మిట్‌లు, ఫిట్‌నెస్‌ లేకపోవడం, సేఫ్టీ నింబంధనలు పాటించకుండానే రోడ్లపైన తిరుగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. విజయవాడ కేంద్రంగా తిరిగే బస్సులో అత్యధికం ఈశాన్య రాష్ట్రాల రిజిస్ట్రేషన్లతో ఉన్నవే. అరుణాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌, ఒడిశా రాష్ట్రాల్లో పర్మిట్‌లు పొంది మన రాష్ట్రంలో విచ్చలవిడిగి తిరుగుతున్నాయి. ఈ బస్సులకు ఫిట్‌నెస్‌, పర్మిట్లు ఉన్నాయా? లేవా? ప్రయాణికులతో పాటు సరుకు రవాణా చేస్తున్నాయా అన్న అంశాలను నిరంతరం తనిఖీ చేయాల్సిన అధికారులు వాటివైపు కన్నెత్తి చూసిన పాపాన పోవడం లేదు.

అంతా అడ్డగోలు

కొందరు ట్రావెల్స్‌ యజమానులు ఫిట్‌నెస్‌ ఉన్న బస్సుల నంబర్లతో మరో రెండు మూడు పాత బస్సులను నడుపుతున్నారు. ఒక బస్సు విశాఖ రూట్‌లో వెళ్తే అదే నంబరుతో మరో బస్సు హైదరాబాద్‌, ఇంకొకటి బెంగళూరు రూట్‌లో ప్రయాణిస్తాయి. ఈ విషయాలన్నీ రవాణా శాఖ అధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. డ్రైవర్లు ఏ స్థితిలో ఉన్నారో కూడా పట్టించుకోవడం లేదు. 2017లో హైదరాబాద్‌ జాతీయ రహదారిపై పెనుగంచిప్రోలు మండలంలో దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదానికి గురై పది మంది మృత్యువాత పడ్డారు. తాజాగా కర్నూలులో జరిగిన ఘటనలో 20 మంది చనిపోయారు. రెండేళ్ల క్రితం విజయవాడలో రోడ్డుపక్కన నిలిపి ఉంచిన బస్సు అగ్నికి ఆహుతైంది. కారణాలు తెలియలేదు. ఈ ప్రమాదాల నుంచి అటు ట్రావెల్స్‌ నిర్వాహకులు, ఇటు అధికారులు గుణపాఠం నేర్చుకోవడం లేదు.

ప్రయాణికులతోపాటు సరుకు రవాణా

విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ప్రయాణికులనే కాకుండా సరుకు రవాణా చేస్తున్నారు. విజయవాడ ఆటో నగర్‌, హనుమాన్‌పేట తదితర ప్రాంతాల్లో నిత్యం ప్రైవేటు బస్సులు సరుకు లోడింగ్‌ చేసుకుని వెళ్తుంటాయి. పోలీసులు, రవాణా శాఖ అధికారులు వారిపై చర్యలు తీసుకున్న పాపాన పోవడం లేదు. బస్సుల్లో ఏయే సరుకులు రవాణా చేస్తున్నారో కూడా నిఘా ఉండడం లేదు. కొన్ని బస్సుల్లో కింది భాగంలో బైక్‌లు ఎక్కిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే బైక్‌ల్లోని పెట్రోల్‌ ట్యాంక్‌లు పగిలి అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

బస్టేషన్‌కు రెండు మూడు కిలో మీటర్ల పరిధిలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులను నిలిపి ప్రయాణికులను ఎక్కించకూడదన్న నిబంధనలు ఉన్నాయి. అయితే విజయవాడ బస్టాండ్‌ ఎదురుగానే ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. కేబిన్‌లోనూ ప్రయాణికులను ఎక్కించి దందా సాగిస్తున్నారు. ప్రయాణికుల రద్దీని ఆసరాగా తీసు కుని అధిక ధరలు వసూలు చేస్తున్నారు. ఆయా శాఖల అధికారులు స్పందించి ప్రైవేటు బస్సుల్లో ఫిట్‌ నెస్‌, పర్మిట్లు, భధ్రత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

విశాఖపట్నం, చైన్నె, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి ప్రాంతాలకు తగినన్ని బస్సులను ఆర్టీసీ నడపాలి. ఆర్టీసీ బస్సులు లేక పోవడం వల్లే ప్రైవేటు టావెల్స్‌ బస్సులను ఆశ్రయించాల్సి వస్తోంది. సురక్షితం కాదని తెలిసినా తప్పనిసరి పరిస్థితిలో ట్రావెల్స్‌ బస్సుల్లో ప్రయాణించక తప్పడంలేదు. – తిమోతి, ప్రయాణికుడు, విజయవాడ

ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారుల పర్యవేక్షణ లోపించింది. ట్రావెల్స్‌ నిర్వాహకులు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. టన్నుల కొద్దీ సరుకును ప్రయాణికుల బస్సుల్లో లోడు చేస్తున్నారు. ఆ బస్సులు పరిమితికి మంచి లోడుతో ప్రయాణిస్తున్నాయి. ఫలితంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.

– శరత్‌,

ప్రయాణికుడు, విజయవాడ

ప్రైవేటు బస్సు.. భద్రత తుస్సు 1
1/2

ప్రైవేటు బస్సు.. భద్రత తుస్సు

ప్రైవేటు బస్సు.. భద్రత తుస్సు 2
2/2

ప్రైవేటు బస్సు.. భద్రత తుస్సు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement