కలెక్టరేట్‌లో మోంథా తుపాను కంట్రోల్ రూమ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మోంథా తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో 91549 70454 నంబరుతో కమాండ్ కంట్రోల్ రూమ్ (సీసీసీ) ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. జిల్లా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందాలను క్రియాశీలం చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ఆర్డీఓలు, మునిసిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులతో మోంథా తుపానుపై కలెక్టర్ లక్ష్మీశ శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. కలెక్టరేట్‌తో పాటు డివిజన్ల వారీగా కూడా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయా లని ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, వైద్య – ఆరోగ్యం, అగ్నిమాపక, పౌర సరఫరాలు, మునిసిపల్, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలోనే అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించి, అవసరం మేరకు పునరావాస శిబిరాలను ఏర్పాటుచేయాలన్నారు. విజయవాడ అర్బన్ పరిధిలోని కొండ ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాలని, గర్భిణులు, వృద్ధులకు పరిస్థితిని బట్టి ముందే పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించాలని సూచించారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాతాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. ఇందుకు వైద్య ఆరోగ్య శాఖ, వీఎంసీ అధికారులు సమష్టిగా కృషిచేయాలన్నారు. చెరువులకు గండ్లు పడే ప్రమాదం ఉంటే పటిష్ట రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి, ఎక్కడైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినా, స్తంభాలు పడిపోయినా యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేప ట్టాలన్నారు. వర్షాల కారణంగా కృష్ణానదితోపాటు వాగులు, వంకలకు వరద పోటెత్తే అవకాశం ఉన్నందన్నారు. నదికి వెళ్లే మార్గాలు, వాగులు, వంకల వద్ద వరద హెచ్చరిక బోర్డులను తప్పని సరిగా ఏర్పాటు చేయాలని, వాటిని ఎవరూ తొలగించకుండా చూడాలని ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.


