గోవులకు లంపి స్కిన్ టీకా
పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మవారి గోశాలలో గోవులకు లంపి స్కిన్ టీకాలు వేశామని పశు వైద్యాధికారి పి. అనిల్ తెలిపారు. ‘ఆవులకు లంపి స్కిన్ వ్యాధి’ అనే శీర్షికతో ఈనెల 20న సాక్షి దినపత్రికలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. గోశాలలో వ్యాధి వచ్చిన ఆవు దూడలను గుర్తించి వెంట నే వాటిని మిగతా ఆవుల నుంచి వేరు చేసి వైద్యం అందిస్తున్నామన్నారు. వ్యాధి సోకని వాటిని గుర్తించి, ముందస్తుగా టీకాలు వేసినట్లు పేర్కొన్నారు. కొత్తగా గోశాలకు గోవులు ఇచ్చే రైతుల నుంచి లంపిస్కిన్ టీకా తరువాత మాత్రమే స్వీకరించాలని దేవస్థానం వారికి సూచించిందని వివరించారు.
గన్నవరం: ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నాయకులతో సీఎం చంద్రబాబునాయుడు జరిపిన చర్చలు తీవ్ర నిరాశను కలిగించాయని ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి డి. విద్యాసాగర్ అన్నారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ 12వ పీఆర్సీ, నాలుగు పెండింగ్ డీఏల చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు కొండంత ఆశలు పెట్టుకున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎంతో జరిగిన చర్చల తర్వాత కేవలం ఒక డీఏ మాత్రమే ఇవ్వడం కంటి తుడుపు చర్యగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ తీరుపై రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర నిరాశ చెందుతున్నట్లు పేర్కొన్నారు. 12వ పీఆర్సీకి సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలను ఎప్పటి నుంచి ఇచ్చేది కూడా ప్రకటించకపోవడం దురదృష్టకరమన్నారు. 2010 కంటే నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు పొందేలా సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని కోరారు.
ఉయ్యూరు: మైనరు బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి యత్నించిన ఘటన ఉయ్యూరు పట్టణంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కాపు రామాలయం ప్రాంతంలో తాపీ కార్మికుడు చాన్‌బాషా నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలిక రోజూ చాన్‌బాషా ఇంటికి ఆడుకునేందుకు వెళ్తుంది. మంగళవారం చాన్‌బాషా ఇంట్లో పిల్లలతో ఆడుకుంటున్న మైనరు బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. అత్యాచారయత్నానికి పాల్పడేందుకు యత్నించగా, బాలిక భయపడి పెద్దగా కేకలు వేసింది. దీంతో ఇరుగుపొరుగు బాలిక కేకలు విని చాన్‌బాషా ఇంటికి పరుగెత్తుకుని వెళ్లి చాన్‌బాషాను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఘటనపై విచారణ చేస్తున్నారు.
పెనమలూరు: కానూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు కావటంతో పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుణదలకు చెందిన మల్లంపల్లి వెంకటస్వామి కానూరు బల్లెంవారి వీధిలో బైక్‌పై వెళ్తుండగా అతడిని ఎదురుగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో అతని కుడి కాలికి బలమైన గాయమైంది. బాధితుడిని విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చిక్సితకు కుటుంబ సభ్యులు చేర్చారు. బాధితుడి సోదరుడు శివకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


