గన్నవరం టీడీపీలో అసమ్మతి కుంపటి
ఎమ్మెల్యే దూరం పెట్టారు
యార్లగడ్డకు
అసమ్మతి సెగ
ఎమ్మెల్యే యార్లగడ్డకు వ్యతిరేకంగా పార్టీ సీనియర్ నాయకుల తిరుగుబాటు
టీడీపీని రక్షించేందుకు కలిసి పనిచేస్తామని ప్రకటన
టిక్కెట్ ఇస్తే వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తానన్న ఏఎంసీ మాజీ చైర్మన్ బసవరావు
బసవరావు జన్మదిన వేడుకలకు మాజీ ఎమ్మెల్యేలు, విజయ డెయిరీ చైర్మన్ హాజరు
సాక్షి టాస్క్‌ఫోర్స్: తిరువూరు టీడీపీలో భగ్గుమన్న విభేదాలు సమసిపోకముందే గన్నవరంలో నియోజకవర్గంలోనూ అసమ్మతి కుంపటి రగులుకుంది. గత ఎన్నికల ముందు అందరితో సఖ్యతగా మెలిగిన యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచాక అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడలపై టీడీపీ సీనియర్ నాయకులు మండిపడుతున్నారు. తాను చెప్పిందే జరగాలన్న ధోరణితో యార్లగడ్డ వ్యవహరించడం, కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలతో వివాదాలు పెట్టుకో వడం, అధికారులపై చిందులు తొక్కడం వంటి అంశాలు పార్టీ క్యాడర్‌కు ఆయనకు మరింత అంతరం పెంచాయి. ఎమ్మెల్యే వైఖరితో విసిగిపోయిన ఆ పార్టీ సీనియర్ నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. గత ఎన్నికల్లో యార్లగడ్డ విజయానికి అహర్నిశలూ శ్రమించామని, తీరా గెలిచిన తరువాత తమను దూరం పెట్టారని వారు ఆరోపిస్తున్నారు.
పుట్టిన రోజు వేడుక వేదికగా తిరుగుబాటు
వైఎస్సార్ సీపీ నుంచి తన వెంట వచ్చిన నాయకులకే ఎమ్మెల్యే యార్లగడ్డ ప్రాధాన్యం ఇస్తూ, పార్టీ క్యాడర్‌ను సైతం నిర్లక్ష్యం చేస్తున్నారని టీడీపీ సీనియర్ నాయకులు రగిలిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధిష్టానం అవకాశం కల్పిస్తే తమ తరఫున ఏఎంసీ మాజీ చైర్మన్ పొట్లూరి బసవరావు పోటీకి సిద్ధమని సంకేతాలు ఇచ్చారు. ఇందుకు కేసరపల్లిలో దీపా వళి రోజు జరిగిన బసవరావు జన్మదిన వేడుకను వేదికగా చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు దాసరి వెంకటబాలవర్ధనరావు, మూల్పూరు బాలకృష్ణా రావు, విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు, షుగర్ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్ గూడపనేని ఉమాప్రసాద్, పార్టీ గన్నవరం మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ భర్త తుమ్మల ఉదయ్, పార్టీ ముఖ్యనేతలు, గన్నవరం, ఉంగుటూరు, బావులపాడు మండ లాల నుంచి పెద్ద సంఖ్యలో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఎనిమిది వేల మందిపైగా ఈ పుట్టినరోజు వేడుకలో పాల్గొనడం సంచలనంగా మారింది. ఈ కార్యక్రమానికి హాజరుకాని పలువురు నేతలు సైతం ఫోన్‌లో సంఘీభావం తెలిపినట్లు తెలుగుదేశం వర్గాల్లోనే చర్చ సాగుతోంది. యార్లగడ్డ ఫొటో లేకుండా బసవరావు జన్మదిన బ్యానర్లు, ఫ్లెక్సీలను భారీగా ఏర్పాటు చేయడం గమనార్హం.
గత ఎన్నికల్లో తన విజయానికి కృషిచేసిన పార్టీ సీనియర్లను ఎమ్మెల్యే యార్లగడ్డ దూరంపెట్టారని ఏఎంసీ మాజీ చైర్మన్ పొట్లూరి బసవరావు ఆరోపిస్తున్నారు. సీనియర్లు అంటే ఆయనకు కనీస గౌరవం లేదని, పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదని, ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నామని పేర్కొంటున్నారు. ఎమ్మెల్యే కేసరపల్లి పర్యటనకు వచ్చినప్పుడు ఇళ్లలో నుంచి బయటకు రాకుండా తమను పోలీసులతో నిర్బంధించారని, ఆయన తీరుతో పార్టీలో ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. పార్టీ శ్రేయస్సు కోసం వచ్చే ఎన్నికల్లో అధిష్టానం ఆదేశిస్తే గన్నవరం ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని బసవరావు స్పష్టంచేశారు.
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన యార్లగడ్డ వెంకట్రావు అతికొద్ది కాలంలోనే ఇటు టీడీపీలో, అటు ప్రజల్లో అసంతృప్తిని మూటగట్టుకున్నారు. విజయ డెయిరీ వ్యవహారం, మద్యం షాపుల లైసెన్సులు, అధికారుల బదిలీలు, పార్టీ వ్యవహారాల విషయంలో యార్లగడ్డకు పార్టీ లోని సీనియర్లకు అభిప్రాయ భేదాలు తలెత్తాయి. యార్లగడ్డ తీరు నచ్చని సీనియర్లు ఆయనకు దూరంగా ఉంటున్నారు. వీరంతా ఒక వర్గంగా ఏర్పడి యార్లగడ్డకు పోటీగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే తీరుపై పార్టీ గన్న వరం మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వర రావు ఫిర్యాదు చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీకి కష్టంలో అండగా నిలబడిన వారిని ఇబ్బంది పెడుతున్నారని, దాడులు చేయడం, తన వద్దకు వెళ్లిన వారిని కించపరచడం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొనట్లు సమాచారం. మద్యం షాపుల టెండర్ల వ్యవహారంలో దరఖాస్తు చేయకుండా బెదిరించి, ముస్తాబాదకు చెందిన టీడీపీ నాయకుడిపై దాడి చేసిన ఘటనపైన నేతలు గుర్రుగా ఉన్నారు. మట్టి తవ్వకాల విషయంలో మంత్రి కొలుసు పార్థసారథిపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన నియోజకవర్గంలో కొంత మంది తనకు చెప్పకుండానే పర్యటిస్తున్నారని బహిరంగంగానే ఆరోపించడం వివాదాస్పదమైంది. ఇటీవల నియమించిన గన్నవరం, ఉంగుటూరు మండల కమిటీల వ్యవహారంలో పార్టీ సీనియర్లు తమను పట్టించుకోలేదని గుర్రుగా ఉన్నారు. మొత్తం మీద గన్న వరం నియోజకవర్గంలో ఏకంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అసమ్మతి కుంపటి రగులుకోవడం చర్చనీయాంశమైంది.


