
నదీ జలాలు చంద్రబాబు ఆస్తి కాదు
ఏబీ వెంకటేశ్వరరావు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ‘‘మీ ప్రాజెక్టులు మీరు కట్టుకోండి. మా ప్రాజెక్టులను మేము కట్టుకుంటాం. మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పడానికి ఈ ప్రభుత్వానికి, ముఖ్య మంత్రి చంద్రబాబుకు హక్కులేదు. ఇది చంద్రబాబు సొంత ఆస్తి కాదు. రాష్ట్ర ప్రజలందరి నీటి హక్కుల సమస్య’’ అని ఆలోచనాపరుల వేదిక సభ్యుడు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎ.బి.వెంకటేశ్వరరావు అన్నారు. ఎగువనున్న తెలంగాణ రాష్ట్రం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఆయన మంగళవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ కృష్ణా నదీ జలాల విషయంలో బచావత్ ట్రిబ్యునల్ తీర్పును ఉల్లంఘిస్తూ ఎగువ రాష్ట్రాలు అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే చంద్ర బాబు ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని ఆరోపించారు. బచావత్ ట్రిబ్యునల్ రాష్ట్రానికి కేటాయించిన 512 టీఎంసీల నీటి వాటాను వినియోగించుకోవడంలోనూ ప్రభుత్వం విఫల మైందన్నారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 34ను చూపి రాయలసీమ ప్రజలను బెదరగొట్టి బనకచర్ల ప్రాజెక్టు అనే గుదిబండను ఏపీ మెడకు చుట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. ఆలోచనాపరుల వేదిక సభ్యులు టి.లక్ష్మీనారాయణ, అక్కినేని భవానీప్రసాద్ పాల్గొన్నారు.