
యూరియా దొరక్క ఇక్కట్లు!
పెడన: పీఏసీఎస్‌ల పరిధిలోని కూటమి నాయకులు వచ్చిన యూరియా కట్టలను గద్దల్లా తన్నుకుపోతున్నారు. పీఏసీఎస్‌ల సిబ్బంది చేసేదేమీ లేక చూస్తూ మిన్నకుండిపోతున్నారు. కనీసం విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకురాకపోవడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పెడన మండలంలో యూరియా దొరక్క రైతులు రోజు రోజుకు ఆందోళన చెందుతున్నారు. పీఏసీఎస్‌లు ద్వారా ఇప్పటికే ముందుగా బుక్ చేసుకున్న వారికి కూడా దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. చేవేండ్ర పీఏసీస్ పరిధిలో యూరియా కట్టలు రావడతో ఆ ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడొకరు సుమారు 70 యూరియా కట్టలను ట్రాక్టరులో వేసుకుపోయినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇది గ్రామంలో తీవ్రస్థాయిలో చర్చనీయాంశ మైంది. ఇలా చేయడం చాలా దారుణమని వాపోతున్నారు. అధికారులు సైతం చూిసీచూడనట్లుగా వ్యవహరించడం చాలా అన్యాయమని, రైతులందరికి సమన్యాయంగా యూరియా అందించాల్సిన బాధ్యత లేకుండా నడుచుకోవడం పట్ల పరిస్థితి మరింత చేయిదాటే ప్రమాదం ఉందన్నారు.
బయట మార్కెట్‌లో గుళికలతో....
బయట మార్కెట్‌లో గుళికలు కూడా కొనుగోలు చేస్తేనే యూరియా ఇస్తామనే వాదనను ఎరువుల దుకాణాల వారు స్పష్టం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. దీంతో రూ.200 పెట్టి యూరియా కొంటే రూ.600 పెట్టి గుళికలు కొనుగోలు చేయాల్సి వస్తుందని, ప్రస్తుతం గుళికలతో పని లేదని, అయినా అంటగడుతుండటంతో బయట యూరియా కొనుగోలు చేయడం లేదని రైతులు పేర్కొంటున్నారు. ఎరువుల దుకాణంలో ఆ పరిస్థితి ఉంటే పీఏసీఎస్‌లలో మరింత దారుణంగా ఉందని పేర్కొంటున్నారు. పీఏసీఎస్‌లలో రుణం తీసుకున్న వారికి మాత్రమే యూరియా ఇస్తామని పేర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుణాలు పొందిన వారికి యూరియా కట్టలు దొరకడం లేదని, రెండు దఫాలుగా చేవేండ్ర పీఏసీఎస్‌కు 800 కట్టలు వచ్చినా ఇవ్వలేదంటూ పలువురు రైతులు వాపోతున్నారు.
గద్దల్లా తన్నుకుపోతున్న టీడీపీ నాయకులు రుణాలు తీసుకున్న వారికే కట్టాలంటూ మెలిక బయట మార్కెట్‌లో గుళికలతో లింకు నో స్టాక్ అంటున్న ఎరువుల దుకాణాలు
పక్కాగా పంపిణీ చేస్తున్నాం
చేవేండ్ర పీఏసీఎస్ పరిధిలో 70 కట్టలు ఒకరే తీసుకుపోయారనే విషయం వాస్తవం కాదు. విచారణ చేశాం. చేవేండ్ర పీఏసీఎస్‌కు యూరియా కట్టలు రావడంతో రైతులు అధిక సంఖ్యలో వచ్చారు. రాత్రి కావడంతో తాళాలు వేసేందుకు సిద్ధం అవ్వగా ఆ వ్యక్తి వచ్చి రైతుల పేర్లు నమోదు చేసుకుని అందజేశారు. దానిని కావాలని కొందరు వక్రీకరించారు. అంతా పక్కాగా పంపిణీ చేస్తున్నారు. అయితే తీసుకువెళ్లిన వారే మళ్లీ మళ్లీ వచ్చి తీసుకుపోతున్నారు.
– ఎస్.జెన్నీ, ఏవో, పెడన మండలం

యూరియా దొరక్క ఇక్కట్లు!