లబ్బీపేట(విజయవాడతూర్పు): విభాగాల మధ్య విభేదాలతో ప్రజారోగ్యానికి విఘాతం కలుగు తోంది. ఉమ్మడి జిల్లాలోని ప్రజారోగ్య శాఖలో సమన్వయ లోపంతో ఆరోగ్య కార్యక్రమాలు పడకేశాయి. ఆ శాఖలో అధికారుల హడావుడి మినహా క్షేత్రస్థాయిలో ఏమీ అమలు కావడం లేదు. ఇంటింటి సర్వే ఎప్పుడో మర్చిపోయారు. గర్భిణుల ట్రాకింగ్ సరిగా జరగడం లేదు. కేంద్రం అమలు చేస్తున్న అనేక పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే మానేశారు. దీంతో అవి లబ్ధి దారుల దరి చేరడం లేదు. వీటన్నింటికీ కారణం సిబ్బంది మధ్య సమన్వయం లేక పోవడమేననే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు సీహెచ్‌ఓ, ఏఎన్‌ఎంల మధ్య ఆధిపత్య పోరు కొనసాగు తోంది. ఆ ప్రభావం వైద్య సేవలపై పడుతోందని వైద్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
పట్టించుకోవడమే మానేశారు
ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలు ఆరోగ్య కార్యక్రమాలు వ్యాధిగ్రస్తుల దరి చేరడం లేదు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో గర్భిణుల ట్రాకింగ్ సరిగా జరగడం లేదు. రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్న వారిని వైద్య సిబ్బంది ఫాలోఅప్ చేయడం మానేశారు. దీంతో వాళ్లు ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లిన తర్వాత సమాచారం తెలుసుకుని అక్కడకు పరుగులు పెడుతున్నారు. అంతేకాదు గర్భిణులకు ప్రసవం తర్వాత అందాల్సిన పీఎం జేఎస్‌వై సగం మందికి అందడం లేదు. దీనికి ఆ పథకంపై వైద్య సిబ్బంది అవగాహన కలిగించక పోవడమే కారణంగా చెబుతున్నారు. గర్భిణులకు సీ్త్ర శిశు సంక్షేమశాఖ నుంచి అందాల్సిన పోషకాహారం అంతం మాత్రంగానే ఉంది. అందుకు సిబ్బంది సమన్వయమే లోపం అంటున్నారు.
ఇంటింటి సర్వే ఏదీ
మలేరియా విభాగంలో పనిచేసే హెల్త్ అసిస్టెంట్‌లు నెలలో రెండుసార్లు, కనీసం ఒకసారైనా తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించాల్సి ఉంది. వాళ్లు సందర్శించిన తేదీలను ఆ ఇంటి గోడపై నమోదు చేయాలి. ఇంటింటినీ సందర్శించి జ్వరాలపై సర్వే చేసే కార్యక్రమాన్ని ఎప్పుడో వదిలేశారు. వారిపైన ఉన్న హెల్త్ సూపర్‌వైజర్స్ పర్యవేక్షణను కూడా పూర్తిగా వదిలేశారు. వారానికి ఒకసారి నిర్వహించే డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో రెండిళ్లు సందర్శించి ఫొటోలు తీసి, యాప్‌లో, గ్రూప్‌లో అప్‌లోడ్ చేసి మమ అనిపిస్తున్నారు. అంతేకానీ ఏ ఒక్క ఇంట్లో వ్యాధి కారక లార్వాను గుర్తించిన సందర్భాలు లేవు. అంతేకాదు నగరంలో యాంటీ లార్వా ఆపరేషన్ కూడా సరిగా జరగడం లేదు. అధికారుల బంగళా చుట్టూ ఫాగింగ్ చేయడం మినహా నగరంలో ఎక్కడా చేయడం లేదు.
లక్ష్యానికి తూట్లు
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్(సీహెచ్‌ఓ), ఏఎన్‌ఎంల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో సందర్శన విషయంలో వీరి మధ్య ఎప్పటి నుంచో వివాదాలు సాగుతున్నారు. ఒకదశలో ఏఎన్‌ఎంలకు ఏ..బీ..సీ..డీలు కూడా రావంటూ సీహెచ్‌ఓలు వ్యక్తిగత విమర్శలు చేశారు.
ఇలా వీరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్స్(వెల్నెస్ సెంటర్స్)లో సేవల లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. దీంతో ఏడాదిగా సేవలు మరుగున పడ్డాయి. ఆ వివాదాలను పరిష్కరించడాన్ని అధికారులు సైతం పట్టించుకోవడం లేదు.
విభాగాల మధ్య విభేదాలు ప్రజారోగ్యశాఖలో సమన్వయ లోపం పడకేసిన ఆరోగ్య కార్యక్రమాలు ఇంటింటి సర్వే అంతంత మాత్రమే లార్వా నిర్మూలన ఆపరేషన్ లేదు గ్రామాల్లో ఏఎన్‌ఎం, సీహెచ్‌ఓల ఆధిపత్య పోరు
పీహెచ్‌సీలు
ఎన్టీఆర్ 23
కృష్ణా 50
యూపీహెచ్‌సీలు
ఎన్టీఆర్ 50
కృష్ణా 12
వెల్నెస్ సెంటర్‌లు
ఎన్టీఆర్ 257
కృష్ణా 357
వైద్య రంగాన్ని విస్మరిస్తున్నారు
రాష్ట్రంలో వైద్య రంగం పూర్తిగా నిర్వీర్యంగా మారింది. ప్రభుత్వాస్పత్రిల్లో సేవలు దిగజారాయి. ప్రజారోగ్యం పడకేసింది. ఉద్యోగులు, అధికారుల మధ్య సమన్వయం లోపించినా పాలకులకు పట్టడం లేదు. కార్పొరేట్‌లకు ఆస్పత్రిలు అప్పగించి పర్సంటేజీలు దోచుకోవడం మినహా, ఆస్పత్రిలను బలోపేతం చేసి, రోగులకు నాణ్యమైన సేవలు అందించాలనే ఉద్దేశమే ప్రభుత్వానికి లేదు. దీంతో ఉద్యోగులు సైతం ఎవరి దారిలో వారు నడుస్తున్నారు.
–డాక్టర్ మెహబూబ్ షేక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ వైద్య విభాగం
ప్రజారోగ్యానికి విఘాతం!