
పేదరిక నిర్మూలనకే పీ – 4 విధానం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సమాజం నుంచి పేదరికాన్ని సమూలంగా దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పీ – 4 విధానాన్ని అమలుచేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టరేట్ వీసీ హాల్‌లో కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో బుధవారం కలిసి వివిధ పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థలు, ఆస్పత్రులు, అసోసియేషన్లు ప్రతినిధులతో పీ4 విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. పీ – 4 విధానం విధివిధానాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
బంగారు కుటుంబాలకు ఆసరా..
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న 10 శాతం మంది సమాజంలోని అట్టడుగున ఉన్న 20 శాతం కుటుంబాలను అన్ని విధాలా పైకి తీసుకొచ్చేందుకు వినూత్నంగా పీ – 4 విధానాన్ని తీసుకువచ్చామన్నారు. జిల్లాలో ఇంటింటి సర్వే ద్వారా 86,398 బంగారు కుటుంబాలను గుర్తించామని.. ఇప్పటికే 2,557 మంది మార్గదర్శులుగా ముందుకొచ్చారని, 18,373 కుటుంబాలను దత్తత తీసుకున్నారని చెప్పారు. రెడ్‌క్రాస్, విజయవాడ మహానగర్ లయన్స్ క్లబ్, అమ్మా అసోసియేషన్ వంటి సంస్థలు కూడా పెద్దమొత్తంలో బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చాయన్నారు. ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ పారిశ్రామికవేత్తలు, ఎన్నారైలు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు తదితరులు ముందుకురావాలని కోరారు. కేవలం ఆర్థిక వనరులే కాదు.. బంగారు కుటుంబాల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, స్వయం ఉపాధి, ఆరోగ్య అవసరాలు వంటివాటి విషయంలో మార్గదర్శులు వేసే ఓ చిన్న అడుగు పేద కుటుంబాలు ఎదిగేందుకు దోహదం చేస్తాయన్నారు. సమావేశంలో సీపీవో వై.శ్రీలత, గ్రామ, వార్డు సచివాలయాల సమన్వయ అధికారి జి.జ్యోతి, వివిధ పరిశ్రమలు, సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ