
ఉత్తమ ప్రతిభ చూపిన పీజీకి గోల్డ్ మెడల్
లబ్బీపేట(విజయవాడతూర్పు): పోస్టు గ్రాడ్యుయేషన్ జనరల్ సర్జరీ విభాగంలో ఉత్తమ ప్రతిభతో యూనివర్సిటీ టాపర్‌గా నిలిచిన ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల విద్యార్ధి డాక్టర్ టి.వి.ఎస్.ఎస్.ప్రీతమ్‌రెడ్డికి డాక్టర్ కనకమేడల శ్రీనివాస్‌కుమార్ స్మారక గోల్డ్‌మెడల్ ప్రదానం చేశారు. వైద్య కళాశాలలో ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వేమిరెడ్డి రాధికారెడ్డి చేతుల మీదుగా డాక్టర్ ప్రీతమ్‌రెడ్డికి గోల్డ్‌మెడల్ అందజేశారు. ఈ సందర్భంగా రాధికారెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ కనకమేడల శ్రీనివాస్‌కుమార్ స్మారకంగా ఆయన సతీమణి డాక్టర్ రాధిక స్థాపించిన ఈ గోల్డ్‌మెడల్‌ను ఏటా జనరల్ సర్జరీలో ఉత్తమ ప్రతిభ కలిగిన పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థికి అందించడం అభినందనీయమన్నారు. ఈ ఏడాది ఉత్తమ ప్రతిభ చూపిన డాక్టర్ ప్రీతమ్‌రెడ్డి విశ్వ విద్యాలయం టాపర్‌గా నిలిచి, ఆ గోల్డ్ మెడల్ అందుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా రేడియాలజిస్ట్, కళాశాల పూర్వ విద్యార్ధి డాక్టర్ వి.ఎన్.వరప్రసాద్, డాక్టర్ కనకమేడల శ్రీనివాస్‌కుమార్ సతీమణి రాధిక, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు, జనరల్ సర్జరీ పూర్వ విభాగాధిపతి డాక్టర్ కె.అప్పారావు, ప్రస్తుత హెచ్‌ఓడీ డాక్టర్ రాజ్‌కమల్ తదితరులు పాల్గొన్నారు.