
బకాయిలు పూర్తిగా చెల్లించాలి
ఏఐఎస్‌ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ శ్రీరంగరాజ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ్) జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ శ్రీ రంగరాజ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఏఐఎస్‌ఎఫ్ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో ధర్నాచౌక్‌లో ధర్నా జరిగింది. ఈ ధర్నాలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యార్థులకు బకాయిపడిన పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకుండా.. అరకొరగా రూ.600 కోట్లు విడుదల చేయడం దుర్మార్గమన్నారు. ఇప్పటికే కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను మానసికంగా వేధిస్తున్నాయన్నారు. తక్షణమే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.6,400 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆ జీవోను రద్దు చేయాల్సిందే..
పేద విద్యార్థులకు ఉన్నత చదువుల దూరం చేసే జీవో 77 రద్దు చేయాలని రంగరాజ్ డిమాండ్ చేశారు. ధర్నాలో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బండెల నాసర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. సాయి కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యశ్వంత్, కృష్ణాజిల్లా కార్యదర్శి సాదిక్ బాబు, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కార్తీక్, గుంటూరు జిల్లా అధ్యక్షుడు శివ, సహాయ కార్యదర్శి అమర్నాథ్, ప్రణీత్, పవన్, విజయవాడ నగర అధ్యక్ష, కార్యదర్శులు రంజిత్, జగదీష్, మహిళా నాయకులు షణ్ముఖప్రియ, ప్రమోద తదితరులు పాల్గొన్నారు.