
సమష్టిగా ‘పీ–4’ లక్ష్యాల సాధన
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పేదరికం నిర్మూలనకు ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజా భాగస్వామ్యం (పీ4) విధానాన్ని పరుగులు పెట్టించి, లక్ష్యాల సాధనకు సమష్టిగా కృషి చేద్దామని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ నియోజకవర్గాల ప్రత్యేక అధికారులతో అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జీరో పవర్టీ–పీ4, జిల్లా, నియోజకవర్గాల దార్శనిక ప్రణాళికలు–కీలక ప్రగతి సూచికలు, పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీపై వర్క్‌షాప్ జరిగింది. ఈ వర్క్‌షాప్‌లో ఏడు నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ జిల్లా చాప్టర్ సభ్యులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా సమ్మేళనాలు నిర్వహించాలన్నారు. కుటుంబాలను, గ్రామం/మండలాన్ని దత్తత తీసుకోవడం, ప్రత్యేక అవసరాలకు ఆర్థిక మద్దతుతో పాటు కుటుంబాన్ని పేదరికం నుంచి బయటకు తెచ్చేందుకు అవసరాలను గుర్తించడం, బంగారు కుటుంబాల్లో చేరికకు పరిమితులతో పాటు పీ4 అమలుకు సంబంధించి జూలై, ఆగస్టు రెండు నెలల కార్యాచరణను కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. గ్రామ సభల నిర్వహణపై పీ4 ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్ (పీఎంయూ) కన్సల్టెంట్ సంతోష్ కుమార్ వివరించారు. సమావేశంలో సీపీవో వై.శ్రీలత, గ్రామ, వార్డు సచివాలయాల సమన్వయ అధికారి జి.జ్యోతి పాల్గొన్నారు.
నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో
కలెక్టర్ లక్ష్మీశ