
కిలేడీ నేర కథాచిత్రం
గుణదల(విజయవాడ తూర్పు): పెద్ద మొత్తంలో చోరీ చేసేందుకు విశ్రాంత ఇంజినీరును హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులను మాచవరం పోలీసులు అరెస్ట్ చేశారు. మిస్టరీగా మారిన ఈ కేసును ఛేదించిన పోలీసులు సోమవారం స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సెంట్రల్ ఏసీపీ కె.దామోదర్ ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం మండలం, మాయాబజార్ ప్రాంతానికి చెందిన పల్లపు మంగ అలియాస్ అనూష (31) తన పన్నెండేళ్ల వయసులో ప్రేమ వివాహం చేసుకుంది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. జల్సాలకు అలవాటు పడిన అనూష సులువైన మార్గంలో డబ్బు సంపాదించడంపై దృష్టి సారించింది. దీంతో అనుష, ఆమె భర్త మధ్య తరచూ గొడవలు జరగడంతో ఇద్దరూ విడిపోయారు. అనంతరం అనూష తన పిల్లలతో కలసి విజయవాడకు వచ్చేసింది. ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అటుపై హైదరాబాద్ వెళ్లి అక్కడా ఇదే పనులు కొనసాగించింది. అక్కడ రాజా అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వారిద్దరూ వివాహం చేసుకున్నారు. కొంత కాలం సిద్ధిపేటలో ఉన్నారు. ఈ క్రమంలో వ్యసనాలకు సైతం అలవాటు పడిన ఆమె కొద్ది రోజులకే రాజాతో విడిపోయింది. గత యేడాది ఓ యాప్‌లో పరిచయమైన ఉపేంద్రరెడ్డితో సహజీవనం చేస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని నులకపేట వద్ద ఇల్లు తీసుకుని వారిద్దరూ నివసిస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడ గుణదలలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన విశ్రాంత ఇంజినీర్ బుద్దలూరి వెంకటరామారావుకు తెలిసిన వారి ద్వారా ఫోన్ చేసి వారి ఇంట్లో అనుష పనిమనిషిగా చేరింది. చేరిన కొద్ది రోజులకే ఇంట్లోని పరిస్థితిని అవగతం చేసుకుంది. విలువైన వస్తువులు, డబ్బు, బంగారం అధికంగా ఉంటుందని, చోరీ చేస్తే పెద్ద మొత్తంలో సొత్తు లభిస్తుందని భావించింది. తాను పనిచేస్తున్న ఇంట్లో చోరీ చేసి దూరంగా వెళ్లి స్థిరపడిపోదామని ఉపేంద్రరెడ్డికి సూచించింది. ఈ ప్రతిపాదనకు అంగీకరించిన ఉపేంద్రరెడ్డితో కలసి ఈ నెల పదో తేదీ అర్ధరాత్రి సమయంలో ఇంటి యజమాని వెంకటరామారావును హతమార్చేందుకు సిద్ధమయ్యారు. ఆయన కళ్లల్లో కారంకొట్టి మంచం మీదకు తోసి దిండుతో ఊపిరి ఆడకుండాచేశారు. దీంతో రామారావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ వెంటనే బీరువాలో బంగారం కోసం వెతికారు. బంగారం లభించకపోవడంతో చేతికి అందిన రూ.90 వేల నగదు తీసుకుని అక్కడ నుంచి ఉడాయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు కాళహస్తి, చెన్నయ్ వంటి ప్రదేశాల్లో సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తమ ఇంట్లో సామగ్రి తీసుకుని దూరంగా పారిపోయేందుకు ప్రయత్నంలో భాగంగా సోమవారం నులకపేటకు చేరుకున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు చాకచక్యంగా నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద రూ.41 వేల నగదు, రెండు చీరలు, ఒక హ్యాండ్ బ్యాగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
జల్సాలకు అలవాటు పడిన యువతి ధనవంతుల ఇళ్లే టార్గెట్ విశ్రాంత ఇంజినీరు హత్య కేసును ఛేదించిన పోలీసులు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు నిందితుల అరెస్టు

కిలేడీ నేర కథాచిత్రం