
రాజీయే రాజమార్గం
విజయవాడలీగల్: బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేసుల్లో మధ్యవర్తిత్వంపై అవగాహన కల్పించేందుకు నగరంలో సోమవారం 4కే రన్ నిర్వహించారు. న్యాయ స్థానాల్లో దశాబ్దాలుగా విచారణలో పేరుకుపోయిన కేసులను సత్వరం పరిష్కరించి, కక్షిదారులకు న్యాయం చేయాలన్న సుప్రీం కోర్టు మీడియేషన్, కౌన్సిలేషన్ ప్రాజెక్టు కమిటీ ఆదేశానుసారం రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ సూచనల కోర్టు కాంప్లెక్స్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం మీదుగా తిరిగి కోర్టు కాంప్లెక్స్ వరకు ఈ రన్ సాగింది. ఈ సందర్భంగా బీబీఏ అధ్యక్షుడు ఏకే బాషా మాట్లాడుతూ.. కేసుల సత్వర పరిష్కారానికి ఇద్దరు కక్షిదారులకు రాజీనే రాజమార్గమని సూచించారు. ఇద్దరికీ నష్టం కలుగకుండా వారి న్యాయవాదుల ద్వారా మీడియేషన్ సెల్‌ను సంప్రదిస్తే న్యాయం జరుగుతుందన్నారు. మీడియేషన్ కేంద్రం సెప్టెంబర్ 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల లీగల్‌సెల్ చైర్మన్, రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎ.సత్యా నంద్, 3వ ఏజేసీజే జడ్జి శేషయ్య, ఇతర న్యాయమూర్తులు, బీబీఏ మాజీ అధ్యక్షుడు హజరత్తయ్య గుప్తా, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు
కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): ఏపీ ఈఏపీసెట్–2025లో ర్యాంకులు పొందిన స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతోంది. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ సెంటర్‌లో సోమవారం ప్రశాంతంగా జరిగింది. ఎన్‌సీసీ అభ్యర్థులు 245 మంది, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అభ్యర్థులు 183, సీఏపీ అభ్యర్థులు 217 మంది చొప్పున 645 మంది సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేశామని హెల్ప్‌లైన్ సెంటర్ కో–ఆర్డినేటర్ ఎం.విజయసారథి తెలిపారు. మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఎన్‌సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీలో 50,001 నుంచి చివరి ర్యాంకు వరకు, సీఏపీలో 1,00,001 నుంచి లక్షా యాభై వేల లోపు ర్యాంకు పొందిన విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తామని విజయసారథి తెలిపారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 83 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)లో 83 ఫిర్యాదులు వచ్చాయి. పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబిటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా భూ వివాదాలు, ఆస్తి వివాదాలు, నగర లావాదేవీలపై 51 ఫిర్యాదులు అందగా, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై మూడు, కొట్లాటలపై ఐదు, వివిధ మోసాలకు సంబంధించి రెండు, మహిళా సంబంధిత నేరాలపై ఆరు, సైబర్ నేరాలపై ఒకటి, దొంగతనాలపై నాలుగు, చిన్న వివాదాలపై 11 ఫిర్యాదులు అందాయి. ఆయా ఫిర్యాదులపై సంబంధిత ఎస్‌హెచ్‌ఓలతో మాట్లాడి సత్వరమే పరిష్కార చర్యలు తీసుకోవాలని డీసీపీ ఉదయరాణి ఆదేశించారు.