
ఇళ్లలోనే పేకాట డెన్‌లు...
● నియోజకవర్గంలోని దుర్గాపురం, బావాజిపేట, గాంధీనగర్, శ్రీనగర్ కాలనీ ప్రాంతాల్లో నియోజకవర్గ ముఖ్యనేత అనుచరులు ఇళ్లలోనే పేకాట, బెట్టింగ్ శిబిరాలు ఏర్పాటు చేసి లక్షలు దండుకొంటున్నారు. వీరికి నియోజకవర్గ ముఖ్యనేత అండదండలు ఉండటంతో పోలీసులు చూసీచూడనట్లు పోతున్నారు.
● నియోజకవర్గంలోని 64 వ డివిజన్ పాతపాడు, కండ్రిక ప్రాంతంలో 2.51 ఎకరాల్లో అనుమతులు తీసుకొని, ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు చేసి, భారీగా దోపిడీ చేస్తున్నారు. ఇందులో నియోజకవర్గ ముఖ్యనేతకు వాటా ఉన్నట్లు ఆ పార్టీ నేతల నుంచే గుసగుసలు వినిపిస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దోపిడీకి అంతే లేకుండా పోతోంది. నియోజకవర్గాన్ని నాలుగు భాగాలుగా చేసి ఒక్కో భాగానికి ప్రత్యేకంగా ఒక ఏజెంటును నియమించుకుని అక్రమార్జన చేస్తున్నారు. అనధికార లేఅవుట్లు, అక్రమ కట్టడాలు, ఇళ్లలోనే పేకాట, బెట్టింగ్ శిబిరాలు, రేషన్, మట్టి మాఫియా వంటి దందాలతో చెలరేగి పోతున్నారు. ప్రతి దానికి ఒక రేటు ఫిక్స్ చేసి లక్షలు వసూలు చేస్తున్నారు. ఈ అక్రమ దందాను అరికట్టాల్సిన అధికారులు గుడ్లప్పగించి చూస్తున్నారు. దీంతో నియోజకవర్గ ముఖ్యనేత కనుసన్నల్లో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు.
విచ్చలవిడిగా అక్రమ లేఅవుట్లు
● విజయవాడ మున్సిపల్ పరిధిలో న్యూరాజరాజేశ్వరిపేట, గుణదల, కండ్రిక, మూడు ప్రాంతాల్లో ఇంకా పొలాలు మిగిలి ఉన్నాయి. నగరం విస్తరించే అవకాశం ఉండటంతో ఎకరం, అర ఎకరం చొప్పున దాదాపు 200–300 ఎకరాల్లో అక్రమ లే అవుట్లు వెలిశాయి. ఎకరానికి రూ.10 లక్షల చొప్పున, తన ఏజెంట్ల ద్వారా కలెక్షన్ చేసుకుని నియోజకవర్గ ముఖ్యనేత దండుకొంటున్నారు. అనధికార లేఅవుట్లలో వెలుస్తున్న అక్రమ భవన నిర్మాణాలకు పెద్ద ఎత్తున రేటు పెట్టి వసూలు చేస్తున్నారు.
● ఇన్నర్ రింగ్ రోడ్డు కండ్రిక–రామవరప్పాడు రహదారిలో నున్న గ్రామ రైతుకు చెందిన 3.90 ఎకరాల పొలాన్ని నియోజకవర్గ ముఖ్యనేతే తీసుకుని అనధికారికంగా లేఅవుట్ వేశారు. మట్టితోలి, రోడ్డు వేశారు. కనీసం అధికారులు ఆ లేఅవుట్ వైపు కన్నెత్తి చూడలేదు.
● కండ్రిక ప్రాంతంలో విద్యుత్ లైను సమీపంలో టీడీపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా లేఅవుట్ వేశారు. నియోజకవర్గ ముఖ్యనేత అధికారులను పంపి బెదిరించి రూ.15 లక్షలు తీసుకోవడం ఆ పార్టీ వర్గాల్లోనే చర్చనీయాంశం అయింది. విజయవాడ శివారు పాయకాపురం, కండ్రిక ప్రాంతాల్లో అక్రమ భవంతులు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ప్లాన్ ఉన్నా కొన్నిటికి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. విత్‌అవుట్ ప్లాన్‌లు, అదనపు అంతస్తుకు రేటు కట్టి ఏజెంట్లను నియమించుకుని డబ్బులు వసూలు చేస్తున్నారు. వీటిని నియంత్రించాల్సిన నగర కమిషనర్ తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ముఖ్య పట్టణ ప్రణాళికాధికారి సైతం చూసీ చూడనట్లు పోతున్నారు. దీంతో కింది స్థాయిలో ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరికి వారు తమతమ స్థాయిల్లో మామూళ్లు తీసుకుంటూ మమ అనిపిస్తున్నారు. దీంతో నగరంలో అక్రమ భవనాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. వసూళ్లలో నియోజకవర్గ ముఖ్య నేత అనుచరుడు మా‘మ్మూ’ల్యాద్రిగా మారిపోయారు.
సెంట్రల్ నియోజకవర్గంలో దొంగలు పడ్డారు!

ఇళ్లలోనే పేకాట డెన్‌లు...