
అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం తగదు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పీజీఆర్‌ఎస్ ద్వారా అందే అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం తగదని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అన్నారు. అర్జీదారుల సమస్యలు విని వాటికి సరైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అత్యంత పారదర్శకంగా, అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు రెవెన్యూ పరమైన అంశాలతో పాటు భూసమస్యల పరిష్కారం, రేషన్ కార్డులు, ఇంటి పట్టాల మంజూరు, పెన్షన్‌ల మంజూరు తదితర అంశాలతో కూడిన వినతులను సమర్పించారు.
పీజీఆర్‌ఎస్‌లో 176 అర్జీలు
పీజీఆర్‌ఎస్‌లో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 176 అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, కేఆర్‌సీసీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ కె. పోసిబాబు, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
మట్టి అక్రమ రవాణా అరికట్టాలి
విజయవాడ రూరల్ మండలం వేమవరం, కొత్తూరు తాడేపల్లి గ్రామాల్లోని పోలవరం కట్ట మట్టి అక్రమ రవాణా జరుగుతోంది. అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ చర్యలు తీసుకోవడం లేదు.
– ఎం.జమలయ్య, కొత్తూరు తాడేపల్లి
పెన్షన్ మంజూరు చేయండి
రెండేళ్ల క్రితం వెన్నుపూస దెబ్బతింది. ఆపరేషన్ చేస్తే సరికాలేదు. అప్పటి నుంచి మంచంలోనే ఉంటున్నాను. కుటుంబ పోషణ భారంగా ఉంది. సామాజిక పెన్షన్ ఇప్పించి ఆదుకోండి.
– రంగిశెట్టి శ్రీనివాసరావు, పెద్దాపురం
లోను పేరుతో మోసం చేశారు
మత్రియా తండాలో ఇల్లు నిర్మించుకుంటున్నాను. సిద్ధార్థనగర్‌కు చెందిన బాణావతు రాము, పోరాటనగర్‌కు చెందిన బాణావతు వెంకటేశ్వరరావు నా వద్దకు వచ్చి హౌసింగ్ లోను రూ.18 లక్షలు ఇప్పిస్తానని నమ్మబలికారు. ప్రాసెసింగ్ ఫీజు పేరుతో రెండు దఫాలుగా రూ.85వేలు తీసుకున్నారు. బ్యాంక్ చెక్కులు, ప్రామిసరీ నోట్లు తీసుకున్నారు. లోన్ ఇప్పించకుండా అదనంగా డబ్బులు కావాలని, లేకపోతే చెక్‌లు బ్యాంక్‌లో వేసి బౌన్స్ చేస్తామని బెదిరిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలి.
– కేళావతు రాజ, మత్రియా తండా
ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ