
ఆంధ్రాలో ఆటవిక రాజ్యం
పెడన: రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. సోమవారం ఆయన కృష్ణాజిల్లా పెడన మండలం కృష్ణాపురంలోని ఉప్పాల రాము నివాసానికి చేరుకుని ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత్ చైర్‌పర్సన్ హారికను పరామర్శించి ధైర్యం చెప్పారు. మూడు రోజుల కిందట గుడివాడలో జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. కారు వద్దకు వెళ్లి పగిలిన అద్దాలను చూపుతూ టీడీపీ, జనసేన గూండాలు ఏ విధంగా దాడి చేశారో భరత్‌కు హారిక వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భరత్ మాట్లాడుతూ బీసీల పార్టీ అని గొప్పగా చెప్పుకుంటున్న సీఎం చంద్ర బాబునాయుడు, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ హారికపై దాడి జరిగిన ఘటనపై స్పందించకపోవడం చాలా అన్యాయమన్నారు. మహిళలపై దాడులు జరిగినా, అన్యాయం జరిగినా పూనకం వచ్చినట్లు ఊగిపోయే మీరు బీసీ మహిళకు అన్యాయం జరిగితే ఏం చేస్తున్నారంటూ డెప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను ప్రశ్నించారు. స్పష్టంగా దాడి జరిగినట్లు వీడియోలలో కనిపిస్తున్నా, బాధితులపైనే ఎదురు కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.
పోలీసులు హెల్మెట్లు పెట్టుకుని వచ్చారంటే...
పోలీసులకు అక్కడ ఏం జరుగుతుందో ముందుగానే తెలుసన్నట్లుగా హెల్మెట్లు పెట్టుకుని రావడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. పక్కా ప్రణాళిక ప్రకారమే దాడులు చేశారని, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం దారుణమన్నారు. ఏడాది కాలం నుంచి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై భౌతికంగా, మానసికంగా దాడులు చేస్తూ ఎవరూ ఏంచేయలేరన్నట్టుగా ఎన్డీయే కూటమి సర్కారు నడుస్తోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా వారి హామీలను ఎగ్గొట్టేందుకే ఈ దాడులు చేస్తూ ప్రజలను నోరు విప్పనీయకుండా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.
ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రథమ పౌరురాలైన హారికపై దాడి అమానుషం హారిక, రాము దంపతులపై జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమే హారికను పరామర్శించి ధైర్యం చెప్పిన మాజీ ఎంపీ మార్గాని భరత్
ఎల్లకాలం చెల్లవు...
‘‘గుర్తుపెట్టుకోండి...ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. చంద్రబాబునాయుడుకు వయస్సు అయిపోయింది, వయస్సులో ఉండే వ్యక్తులు ఎవరయ్యా అంటే పవన్‌కల్యాణ్, లోకేష్‌లు. మా ప్రభుత్వం వస్తే మీ పరిస్థితులు ఏమిటనే ఆలోచన చేయండి’’ అని మార్గాని భరత్ హెచ్చరించారు. ఏపీలో ఇప్పటికే ప్రభుత్వంపై ఎంతో వ్యతిరేకత వచ్చిందని, పోటీ చేసే వారికి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటికై నా తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు. బీసీ పార్టీ అని చెప్పుకోవడం కాదని, చంద్రబాబు నాయుడు తక్షణం స్పందించాలన్నారు. దాడులకు పాల్పడిన వారిని తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బీసీ మహిళకు అన్యాయం జరిగితే బీసీ సంఘాలు తక్షణం బయటకు వచ్చి ఈ దాడిని ఖండించాలని ఆయన కోరారు. వైఎస్సార్ సీపీ నుంచి హారిక కుటుంబానికి అండగా నిలబడతామన్నారు. సమావేశంలో ఉప్పాల హారికతో పాటు వైఎస్సార్ సీపీ మచిలీపట్నం నియోజకవర్గం ఇన్‌చార్జి పేర్ని కృష్ణమూర్తి(కిట్టు), జి.కొండూరు, పెడన ఎంపీపీలు వేములకొండ లక్ష్మీతిరుపతమ్మ, రాజులపాటి వాణి, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.