
నిత్యాన్నదానానికి పలువురి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన పలువురు భక్తులు సోమవారం విరాళాలను అందజేశారు. విజయవాడకు చెందిన ఘట్టమనేని రాజగోపాల్, రుసూద్ర పేరిట కుమారుడు నవీన్‌కుమార్ అన్నదానానికి రూ.1.20 లక్షలను ఆలయ ఈవో శీనానాయక్‌కు అందజేశారు. కానూరుకు చెందిన కరిపినేని శివరామకృష్ణారావు పేరిట కుటుంబ సభ్యులైన నాగేశ్వరరావు అన్నదానానికి రూ.1,11,116 విరాళాన్ని ఆలయ ఈవో శీనానాయక్‌కు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ ఈవో అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
దుర్గమ్మకు సారె సమర్పించిన వైఎస్సార్ సీపీ మహిళా విభాగం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాలలో భాగంగా సోమవారం అమ్మవారికి వైఎస్సార్ సీపీ మహిళా విభాగం తరఫున సారెను సమర్పించారు. వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జాయింట్ సెక్రటరీ కొమ్మన స్వప్న, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీదేవిరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ, మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, డెప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, శైలజారెడ్డి అమ్మవారికి సారెను సమర్పించారు. సారెతో అమ్మవారి మూలవిరాట్‌ను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. అనంతరం మహిళా విభాగం నేతలకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు.
60 కేజీల చీరలతో తులాభారం
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో ఆషాఢ మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం పలు భక్త బృందాలు అమ్మవారికి సారెను సమర్పించాయి. భీమవరానికి చెందిన భక్తురాలు సుమారు 60 కేజీలకు పైగా చీరలను తులాభారం వేసి అమ్మవారికి సమర్పించారు. విజయవాడ నగరంతో పాటు గుంటూరు, గోదావరి జిల్లాల నుంచి సోమవారం పలు భక్త బృందాలు అమ్మవారికి సారెను సమర్పించారు. సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్త బృందాలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్
బకాయిలు విడుదల చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పూర్తి బకాయిలు విడుదల చేయాలని ఏఐఎస్‌ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ డిమాండ్ చేశారు. విజయవాడ హనుమాన్‌పేలోని సీపీఐ భవన్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.6400 కోట్ల బకాయిలకు గాను కేవలం రూ.600 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకొందన్నారు. కొన్ని కళాశాలలు ఫీజులు చెల్లించకపోవడంతో సర్టిఫికెట్లు తమ వద్దే ఉంచుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు శాశ్వత రిజిస్ట్రేషన్ చేయాలని, నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, పేదలకు వైద్య విద్యను దూరం చేసే జీవోలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయికుమార్, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

నిత్యాన్నదానానికి పలువురి విరాళాలు

నిత్యాన్నదానానికి పలువురి విరాళాలు