
నీళ్లున్నా.. ఎత్తిపోసేలా లేరు
నారు పోసినా నీరులేక మొలక రాలేదు
నాకు వెల్లటూరు బంధుచెరువు కింద మూడున్నర ఎకరాల పొలం ఉంది. ఇప్పటికే పొడి నారు పోశాం. చెరువులో చుక్కనీరు లేదు. వర్షాలు వెనకాడాయి. పోలవరం కాల్వలో నీరు వస్తున్నప్పటికీ ఎత్తిపోతల పథకం పనిచేయక చెరువుకు నీరు రావడంలేదు. అధికారులు వెంటనే స్పందించి మోటార్లను బాగు చేసి నీటిని విడుదల చేయాలి.
– చింతపల్లి సత్యనారాయణ రైతు, వెల్లటూరు గ్రామం
ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి
నాకు ఆత్కూరు గ్రామంలో సావరాల చెరువు కింద ఆరు ఎకరాల పొలం ఉంది. చెరువుకు నీటిని అందించే ఎత్తిపోతల పథకం పనిచేయక నీరు రావడంలేదు. ప్రభుత్వం ముందు చూపుతో ఎత్తిపోతల పథకాలను వాడుకలోకి తీసుకొస్తే చెరువుల్లోకి నీరు వచ్చేది. ఇప్పటికై నా స్పందించి మోటార్లను బాగు చేయాలి. లేదంటే ఖరీఫ్ సాగు కష్టంగా మారుతుంది.
– దొడ్డా విష్ణువర్ధన్‌రావు, రైతు, ఆత్కూరు గ్రామం
జి.కొండూరు: ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. గతేడాది బుడమేరు వరదలకు ముంపునకు గురైన ఎత్తిపోతల పథకాల మోటార్లను ఏడాది గడిచినా మరమ్మతులు చేయకపోవడంతో నీళ్లు అందుబాటులో ఉన్నా ఎత్తిపోయలేని పరిస్థితిలో ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ఫలితంగా చెరువుల్లో చుక్కనీరు లేక ఖరీఫ్ సాగు ప్రశ్నార్ధకంగా మారింది. వర్షాలు వెనకాడి నార్లు పోసేందుకు కూడా నీరు లేకపోవడంతో ఖరీఫ్ సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే పొడి వరి విత్తనాలు చల్లిన రైతులు నీరు లేక మొక్క మొలవక లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి త్వరితగతిన ఎత్తిపోతల పథకాలను వాడుకలోకి తీసు కొస్తే రైతులకు సాగునీటి కష్టాలు తప్పుతాయి.
మోటార్లు పనిచేయక..
జి.కొండూరు మండల పరిధిలోని హెచ్.ముత్యాలంపాడు గ్రామ పరిధిలోని మూడు చెరువులకు నీరు నింపేందుకు ఇదే గ్రామం వద్ద బుడమేరుపై రూ.51.48 లక్షలతో ఎత్తిపోతల పథకం, ఇక్కడే రూ.190 లక్షలతో ఆత్కూరు గ్రామ పరిధిలోని మూడు చెరువులను నింపేందుకు మరో ఎత్తిపోతల పథకాన్ని 2018లో నిర్మించారు. అదేవిధంగా వెల్లటూరు బంధుచెరువును నింపేందుకు పోలవరం కుడికాల్వపై వెలగలేరు వద్ద రూ.109.10 లక్షలతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. ఇక్కడే రూ.40.57లక్షలతో చేగిరెడ్డిపాడు వీరయ్య చెరువును నింపేందుకు మరో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు.
గత ఎనిమిది రోజులుగా పోలవరం కుడి కాల్వలో పట్టసీమ నీళ్లు పుష్కలంగా వస్తున్న క్రమంలో వెల్లటూరు, చేగిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాలకు నీరు అందుబాటులో ఉన్నప్పటికీ మోటార్లు పనిచేయక నీటి సరఫరా ఆగిపోయింది. అదేవిధంగా హెచ్.ముత్యాలంపాడు గ్రామం వద్ద బుడమేరుపై ఉన్న రెండు ఎత్తిపోతల పథకాలకు పోలవరం కుడికాల్వలో ప్రవహిస్తున్న పట్టిసీమ నీళ్లు ఎగదన్ని అందుబాటులో ఉన్నప్పటికీ ఈ రెండు ఎత్తిపోతల పథకాలు పనిచేయక నీటి సరఫరా ఆగిపోయింది.
రైతులే బాగు చేసుకోవాలా..
ఈ ఎత్తిపోతల పథకాలను నిర్మాణాంతరం వాటిని రైతులే నిర్వహించుకోవాలని వారికి అప్పగించినట్లు ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. అయితే బుడమేరుపై ఉన్న ఎత్తిపోతల పథకాలలో మోటార్లు వరదలకు మునిగిపోవడంతో మరమ్మతులు చేసేందుకు నిధుల విడుదల కోసం ఐడీసీ అధికారులు ప్రతిపాదనలు పంపినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని తెలుస్తుంది. గతేడాది వరదలతో తీవ్రంగా పంట నష్టపోయిన రైతులు పొలాల్లో గండ్లు పూడ్చుకోవడం, మేటలను తొలగించడం వంటి ఖర్చులతో ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు. ఈ క్రమంలో ప్రభుత్వమే ఎత్తిపోతల పథకాల నిర్వహణ చేస్తుందనే అశతో ఇప్పటి వరకు ఎదురు చూశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో చెరువులలో నీరులేక, నార్లు పోసే వీలులేక ఎత్తిపోతల పథకాల్లో మోటార్లు బాగు చేయించుకునేందుకు రైతులే చందాలు వేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ఎత్తిపోతల పథకాల నిర్వహణను గాలికొదిలేసిన అధికారులు
మోటార్లు మరమ్మతులకు
నోచుకోని వైనం
నీరు లేక వెలవెలబోతున్న
ఆయకట్టు చెరువులు
ఖరీఫ్ ఆలస్యమవుతుందన్న
ఆందోళనలో రైతులు

నీళ్లున్నా.. ఎత్తిపోసేలా లేరు

నీళ్లున్నా.. ఎత్తిపోసేలా లేరు

నీళ్లున్నా.. ఎత్తిపోసేలా లేరు