
విద్యార్థులు లక్ష్యాలు నిర్దేశించుకుని శ్రమించాలి
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ)/మచిలీపట్నంఅర్బన్: కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్ అండ్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం)లో సమస్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులను విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీశారు. ఆయా సమస్యల పరిష్కారంలో ఉదాసీనతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా జరి గిన ఈ కార్యక్రమంలో పలు చోట్ల తల్లిదండ్రులు పాఠశాలల్లోని సమస్యలను సమావేశం దృష్టికి తీసు కొచ్చారు. వాటి గురించి ప్రస్తావించాలని, వాటి పరిష్కారంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన పరపతిని పెంచుకునే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడితే సమస్యలపై చర్చించే వేదికగా తల్లిదండ్రులు మార్చారు.
మధ్యాహ్న భోజనంపై అసంతృప్తి వెల్లువ
విజయవాడలోని సెంట్రల్ నియోజకవర్గం 62వ డివిజన్‌లోని పుచ్చలపల్లి సుందరయ్య మునిసిపల్ హైస్కూల్‌లో పీటీఎంకు హాజరైన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావును తల్లిదండ్రులు నిలదీశారు. పాఠశాలలో వసతులు కరువు, మధ్యాహ్న భోజనం తదితర అంశాలపై ఫిర్యాదు చేశారు. బాలికలు మరుగుదొడ్లకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారని, వాటి తలుపులు దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. చాలా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంపై తల్లిదండ్రులు ఉపాధ్యాయులను నిలదీశారు. భోజనం అరగక పిల్లలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
తరగతి గదులపైనా ఫిర్యాదులు
ఎన్టీఆర్ జిల్లాలో 300 పాఠశాలల్లో తరగతి గదుల కొరత వెంటాడుతోంది. తరగతి గదుల కొరతతో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారి తల్లిదండ్రులు మెగా పీటీఎంలో ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చారు. సుమారుగా 185 విద్యాసంస్థల్లో తరగతి గదుల నిర్మాణం చివరి దశలో ఉంది. సుమారు రూ.30 కోట్ల వరకు ఖర్చు చేస్తే తరగతి గదులన్నీ అందుబాటులోకి వస్తాయి. ఏడాదిగా కూటమి ప్రభుత్వం ఒక్కపైసా ఇవ్వకపోవటంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. తరగతి గదుల కొరతపై తల్లిదండ్రులు ఆయా సమావేశాల దృష్టికి తీసుకొచ్చారు.
అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో..
ఎన్టీఆర్ జిల్లాలో సుమారు 1,451 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు పని చేస్తున్నాయి. వాటిల్లో సుమారుగా 3.30 లక్షల మంది విద్యార్థులు ఒకటి నుంచి పదో తరగతి వరకూ చదువుతున్నారు. వాటిలో సుమారుగా 509 వరకూ ప్రైవేట్ విద్యాసంస్థలు కాగా మిగిలిన 942 విద్యాసంస్థలు ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో కొనసాగుతున్నాయి. వీటి అన్నింటిలోనూ మెగా పీటీఎం సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. ప్రభుత్వ యాజమాన్యాలు అన్నింటిలోనూ ఈ సమావేశాలు జరిగాయి. అయితే చాలా చోట్ల మొక్కుబడిగానే ఈ సమావేశాలు జరిగాయి. పెడన బీజీకే జెడ్పీ ఉన్నత పాఠశాలలో 600 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. మెగా పేరెంట్స్ సమావేశానికి వంద మంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా రాలేదని ఉపాధ్యాయులే పేర్కొనడం గమనార్హం. తిరువూరు జెడ్పీ బాలికోన్నత పాఠశాల, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రుల హాజరు నామమాత్రంగా ఉంది.
ఆలస్యంగా వచ్చిన మంత్రి రవీంద్ర
మచిలీపట్నంలోని చిలకలపూడి పాండురంగ మున్సిపల్ హై స్కూలులో పిల్లల పురోగతిపైకన్నా, పాఠశాలల్లోని సమస్యలే తల్లిదండ్రుల వేదికగా ప్రధానంగా చర్చకు వచ్చాయి. కాలేఖాన్‌పేటలోని గోపు వెంకట నానారావు మున్సిపల్ హైస్కూల్‌ను పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ సమావేశం ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుందని సమాచారం ఇవ్వటంతో తల్లిదండ్రులు, విద్యార్థులు సమయా నికి విచ్చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర తీరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చారు. బంటుమిల్లి జెడ్పీ పాఠశాలలో తల్లిదండ్రుల నుంచి స్పందన కరువైంది. పాఠశాలలో 325 మంది విద్యార్థులు ఉండగా 50 మంది తల్లిదండ్రులే పాల్గొన్నారు.
మెగా పీటీఎంకు ప్రైవేట్ పాఠశాలలు డుమ్మా
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని విద్యాసంస్థలు మెగా పీటీఎంకు డుమ్మా కొట్టాయి. ఎన్టీఆర్ జిల్లాలో సుమారు 509 ప్రైవేట్ విద్యాసంస్థల్లో రెండు లక్షల మంది చదువు తున్నారు. సగానికి పైగా విద్యాసంస్థలు ఈ సమావేశాల ఊసే ఎత్తలేదన్న ఆరోపణలు వినిపించాయి. కొన్ని విద్యాసంస్థలు మొక్కుబడిగానే కార్యక్రమాన్ని నిర్వహించాయి. పలు విద్యాసంస్థల్లో ప్రజాప్రతినిధులు రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వటంతో విద్యార్థుల తల్లిదండ్రులు అసహనానికి గురయ్యారు. తల్లికి వందనం పథకాన్ని గురించి పదేపదే చెప్పడం విసుగు తెప్పించింది.
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి లక్ష్యాలు నిర్దేశించుకుని ఉన్నత శిఖరాలకు చేరాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. కొండపల్లి జెడ్పీ బాలికోన్నత పాఠశాల ప్లస్‌లో గురువారం జరిగిన పీటీఎంలో ఆయన పాల్గొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులను ఒకే చోటకు చేర్చి చిన్నారుల సమగ్రాభివృద్థి లక్ష్యంగా సమావేశం జరపడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. సైబర్ దాడులకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. డ్రగ్స్ నిర్మూలనపై పోస్టర్లు ఆవిష్కరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు వివిధ రకాల క్రీడాపోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. కలెక్టర్ పీటీఎంకు హాజరైనా కొందరు విద్యార్థులు ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనాలు తినడం కొసమెరుపు. డీఈఓ సుబ్బారావు, మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, మున్సిపల్ కమిషనర్ రమ్యకీర్తన, తహసీల్ధార్ వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ సీహెచ్ శ్రీనివాస్, ఎస్‌ఎంసీ చైర్మన్ బాజీబీ, హెచ్‌ఎం హేమలత తదితరులు పాల్గొన్నారు.