
అప్రమత్తత అవసరం
సీజనల్ వ్యాధులపై
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, జ్వరాలు ప్రబలకుండా అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మిశ అన్నారు. సీజనల్ వ్యాధులతో పాటు ఉపాధి హామీ పథకం అమలు, ఉద్యాన పంటల పెంపకం అంశాలపై కలెక్టర్ లక్ష్మీశ బుధవారం కలెక్టరేట్ నుంచి ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు, వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డెంగీ, మలేరియా, డయేరియా కేసులు నమోదుకాకుండా క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ఎక్కడైనా వ్యాధి కేసు నమోదైతే పరిసర ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి, నివారణ చర్యలు చేపట్టాలన్నారు. క్రమం తప్పకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఎక్కడా వర్షపునీరు నిలిచిపోకుండా చూడాలన్నారు. యాంటీ లార్వా ఆపరేషన్స్‌ను విస్తృత స్థాయిలో చేపట్టాలని ఆదేశించారు. జ్వరాల కేసుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అందిస్తే అక్కడి నుంచి ఆయా ప్రాంతాల క్షేత్రస్థాయి బృందాలను అప్రమత్తం చేయడం జరుగుతుందన్నారు. సమన్వయం విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ప్రజా భాగస్వామ్యంతో ర్యాలీలు..
డ్రైడే ఫ్రైడే కార్యక్రమాలను ప్రాణంపెట్టి చేయాలని.. దీనివల్ల ప్రజలకు ఆరోగ్య భద్రత లభిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. దోమల నియంత్రణతో పాటు సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కరపత్రాలు, డిజిటల్ కంటెంట్, వీడియో షార్ట్ క్లిప్పింగ్స్ వంటి వాటితో అవగాహన కల్పించాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రజా భాగస్వామ్యంతో ప్రత్యేకంగా ర్యాలీలు వంటివి నిర్వహించాలని స్పష్టం చేశారు. తాగునీటి వాటర్ సోర్స్‌లతో పాటు ఫిల్టర్ పాయింట్లను నిరంతరం తనిఖీ చేయాలని.. ఎక్కడా కలుషితమయ్యే పరిస్థితి రాకుండా చూడాలన్నారు. ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్‌లు చేపట్టాలని.. ఓవర్‌హెడ్ రిజర్వాయర్ల క్లీనింగ్, క్లోరినైజేషన్ సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎం, ఆశా, సచివాలయ సిబ్బందితో అధికారులు సమన్వయం చేసుకుంటూ సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.
రైతులకు అవగాహన
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
ఉపాధి హామీ పథకం ఆసరాతో ఉచితంగా పండ్ల తోటల పెంపకాన్ని చేపట్టేలా ప్రోత్సహించి రైతుకు మంచి ఆదాయం వచ్చేలా చేయాలని, దీనికి సంబంధించి నిర్దేశించిన నాలుగు వేల ఎకరాల లక్ష్యంలో ఒక్క సెంటు కూడా తగ్గడానికి వీల్లేదని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు. ఆర్డీవోలు, ఎంపీడీవోలు, ఏపీవోలు తదితరులు రైతులకు అవగాహన కల్పించి, ప్రోత్సహించాలని ఆదేశించారు. ఇప్పటికి దాదాపు 50 శాతం లక్ష్యాలను చేరుకున్నందున మిగిలిన లక్ష్యాన్ని యుద్ధప్రాతిపదికన చేరుకునేందుకు కృషిచేయాలని స్పష్టం చేశారు. సన్న, చిన్నకారు రైతులను పేదరికం నుంచి బయటపడేసేందుకు ఇదో గొప్ప మార్గమని.. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకునేలా వ్యవసాయ, ఉద్యాన, ఉపాధి హామీ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, డ్వామా పీడీ ఎ.రాము, డీపీవో పి.లావణ్యకుమారి, ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో జె.ఇందుమతి, జిల్లా మలేరియా అధికారి వి.మోతిబాబు, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కో ఆర్డినేటర్ జె.సుమన్ తదితరులు పాల్గొన్నారు.