
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేడు మహా ధర్నా
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): కేజీ నుంచి పీజీ వరకు విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్‌లో గురువారం మహాధర్నాను నిర్వహిస్తున్నామని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్‌యూ) రాష్ట్ర అధ్యక్షుడు కె.భాస్కర్ చెప్పారు. స్థానిక సున్నపుబట్టీల సెంటర్ సమీపంలోని పీడీఎస్‌యూ కార్యాలయంలో సంఘం సభ్యుల సమావేశం జరిగింది. భాస్కర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయిందని, విద్యారంగంలో సమస్యలన్నీ అలాగే ఉన్నాయని చెప్పారు. పాఠశాలల విలీన ప్రక్రియ వల్ల రాష్ట్రంలో వేలాది పాఠశాలలు మూతపడ్డాయన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలు, పేద విద్యార్థులకు దూరమైన పీజీ విద్య, అందరికీ అమలు కాని తల్లికి వందనం, మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం తదితర అనేక సమస్యలు ఉన్నాయన్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ మహా ధర్నాను నిర్వహిస్తున్నామని చెప్పారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి ఐ.రాజేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్.మహర్షి, ఎం.సునీల్, రాష్ట్ర సహాయ కార్యదర్శి రాంబాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు అఖండ, రామకృష్ణ పాల్గొన్నారు.