
విస్తృతంగా సేఫ్ క్యాంపస్ జోన్ తనిఖీలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఉండేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు మంగళవారం సేఫ్ క్యాంపస్ జోన్ పేరుతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. యువతకు మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు, సమాజ శ్రేయస్సుకు దోహదపడే మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలనే సదుద్దేశంతో రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు సూచనల మేరకు డీసీపీలు కేజీవీ సరిత, కేఎం మహేశ్వరరాజు పర్యవేక్షణలో కళాశాలలు, స్కూల్స్ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని పాన్‌షాప్‌లు, బడ్డీ కొట్లలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రజారోగ్యాన్ని పాడు చేసే పొగాకు ఉత్పత్తులపై అనుమతులకు వ్యతిరేకంగా, గుట్కా నిల్వలను ఇతర మత్తు పదార్ధాలను కలిగి ఉంటూ, విక్రయాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమంగా కలిగిఉన్న పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని ఆయా యజమానులపై కేసులు నమోదు చేశారు. ఈ సోదాలు నిరంతరం కొనసాగుతాయని, యువతను పాడు చేసే మత్తు పదార్థాలు, పొగాకు ఉత్పత్తుల నిల్వలు కలిగి ఉన్నా, అక్రమంగా వాటిని విక్రయాలు జరిపినా ఏ మాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వివిధ కళాశాలల్లో విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి గంజాయి, పొగాకు ఉత్పత్తులు, గుట్కా, ఇతర మత్తుపదార్ధాలను తీసుకోవడం వలన కలిగే అనర్థాల గురించి ప్రత్యేక నిపుణులతో అవగాహన కల్పించారు.