
13న బెరంపార్క్‌లో పెయింటింగ్ పోటీలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): పర్యాటకులకు కొత్త అనుభూతులను అందించడానికి ఈ నెల 13వ తేదీ భవానీపురంలోని హరిత బెరంపార్క్‌లో ఫ్లోర్ పెయింటింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఆదివారం హరిత బెరంపార్క్‌లో జరిగిన యోగా కార్యక్రమంలో ఔత్సాహికులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు. అనంతరం పెయింటింగ్ పోటీల పోస్టర్‌ను ఆవిష్కరించారు.
చిన్నారులకు డ్రాయింగ్ పోటీలు
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ 13వ తేదీ ఆదివారం ఉదయం 6.30 గంటలకు నగరపాలక సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఫ్లోర్ పెయింటింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047, పీ4 (ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజా భాగస్వామ్యం) విధానం, సే నో టు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్, స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర, సేవ్ వాటర్, రెడ్యూస్–రీయూజ్–రీసైకిల్, హరితాంధ్ర అంశాలపై పోటీలు ఉంటాయని వివరించారు. చిన్నారులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు 70751 96840 నంబర్‌లో సంప్రదించవచ్చని సూచించారు.
సమయం కేటాయించాలి
యోగా అనేది ఎవరి కోసమో కాదని ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడానికి దైనందిన జీవితంలో ప్రతి రోజూ కొంత సమయాన్ని కేటాయించాలని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. ఉదయాన్నే ముప్పావుగంట సమయాన్ని యోగాకు కేటాయిస్తే ఆ రోజు మనం చేసే ప్రతి పనిపై ఏకాగ్రత సాధించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో వీఎంసీ అదనపు కమిషనర్ డాక్టర్ డి.చంద్రశేఖర్, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ రత్న ప్రియదర్శిని, ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ కృష్ణచైతన్య, అమరావతి బోటింగ్ క్లబ్ సీఈఓ తరుణ్ కాకాని యోగా ఔత్సాహికులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ