
బైక్ చోరీలు చేసే ముఠా అరెస్ట్
ఉంగుటూరు(గన్నవరం): వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగల ముఠాను ఉంగుటూరు పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సుమారు రూ. 10 లక్షల విలువైన ఐదు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఉంగుటూరు పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ శివప్రసాద్ వివరాలను వెల్లడించారు. మండలంలోని వేంపాడుకు చెందిన తుల్లిమిల్లి సీతారామయ్యకు చెందిన పల్సర్ 220 సీసీ బైక్‌ను గత నెల 25వ తేదీ దొంగలు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్‌ఐ గోవిందు, సిబ్బంది అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో దొంగలను గుర్తించారు. చోరీకి పాల్పడిన పెద్దపారుపూడికి చెందిన ముత్యాల మనోజ్‌కుమార్, మరో ముగ్గురు బాలురను అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. వారి నుంచి వేంపాడుతో పాటు గుంటూరు, కంకిపాడు ప్రాంతాల్లో చోరీ చేసిన ఐదు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఎస్‌ఐ, సిబ్బందిని ఎస్పీ గంగాధరరావు, డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించినట్లు సీఐ పేర్కొన్నారు.