
ప్రభుత్వ పాఠశాలలో టేకు చెట్లు నరికివేత
చౌటపల్లి గ్రామస్తుల ఆగ్రహం
వీరులపాడు: ప్రభుత్వ పాఠశాలలోని చెట్లను నరికి కలపను కాజేయడానికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మండలంలోని చౌటపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో 20 ఏళ్ల నాటి 30 టేకు చెట్లు ఉన్నాయి. వాటిలో ఐదు చెట్లు ఎండు దశకు చేరుకున్నాయి. దీంతో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఎటువంటి అనుమతులు లేకుండా విద్యుత్ మిషన్‌తో చెట్లను కట్ చేసి తొలగించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉన్న చెట్లను తొలగించాలంటే ఉన్నతాధికారుల ఆదేశాలతో పాటు మండల పరిషత్‌లో తీర్మానం చేసి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి పాఠశాల ఆవరణలో ఉన్న కలపను స్వాధీనం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై ఎంఈవో పాల్ కెనడీని వివరణ కోరగా పాఠశాల ఆవరణలో చెట్ల తొలగించేందుకు ఎటువంటి అనుమతులు లేవని తెలిపారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు ఆయన చెప్పారు.
అటవీ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకే ఆపరేషన్ కగార్
ఘంటసాల: అటవీ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిందని పౌరహక్కుల సంఘం కృష్ణా జిల్లా కమిటీ సభ్యుడు జక్కా కేశవరావు అన్నారు. ఘంటసాల గోటకంలో కేశవరావు ఆదివారం మాట్లాడుతూ శాంతి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు నాయకత్వం పదేపదే ప్రకటిస్తున్నా, మావోయిస్టులతో చర్చలు జరపాలని ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారన్నారు. మోదీ, షా ప్రభుత్వం మే 21 నుంచి మావోయిస్టు అగ్ర నాయకుల నుంచి కార్యకర్తలను పెద్ద సంఖ్యలో బూటకపు ఎన్‌కౌంటర్లతో కాల్చి చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాశ్మీర్‌లో మన పౌరులను దారుణంగా చంపిన పాకిస్తాన్ పాలకులతో శాంతి చర్చలు జరపగలిగిన కేంద్రం మావోయిస్టులతో చర్చలకు నిరాకరించి నరమేథాన్ని కొనసాగించడం కుటిలనీతి కాదా అని ప్రశ్నించారు. చత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలోని సహజవనరులను పాలకులు బడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలపై మావోయిస్టులు ఆప్రాంత ప్రజలను చైతన్యం పర్చడంతో గిరిజనలు, ఆదివాసీలు ఎదురిస్తుండటంతో దీనికి ప్రతిగా ఆపరేషన్ కగార్ మొదలైందన్నారు. ఈ దోపిడీకి అడ్డుపడుతున్న అటవీ చట్టాన్ని మార్చివేసి అటవీ సంరక్షణ నిబంధనలు 2022 చట్టాన్ని పార్లమెంట్‌లో ప్రతిపక్షాల నిరసనల మధ్య అప్రజాస్వామికంగా తీసుకొచ్చారన్నారు. దోపిడీ ఉన్నంతకాలం ప్రజలు హక్కుల కోసం పోరాడతారని చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలలో టేకు చెట్లు నరికివేత