
ఉపాధి హామీలో అవినీతిపై న్యాయ విచారణ జరిపించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జాతీయ గ్రామీ ణ ఉపాధి హామీ పథకంలో అవినీతి రాజ్యమేలుతోందని వైఎస్సార్ సీపీ ఎంపీపీల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మార్కపూడి గాంధీ అన్నారు. ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే న్యాయ విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పంచాయతీరాజ్ విభాగంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు రెండు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని, వారందరికీ సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం నిబంధనలకు విరుద్ధంగా పనులను వెండార్లకు కేటాయించారని, ఇది సరికాదన్నారు. ఈ పథకాన్ని టీడీపీ నేతల జేబులు నింపుకొనే పథకంగా మార్చివేసిందన్నారు. ఉపాధి హామీ పనులు పంచాయతీల ద్వారానే జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ రాజ్ వ్యవస్థలో వేళ్లూనుకుపోయిన సమస్యల పరిష్కారానికి పూనుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందన్నారు. కేంద్రం విడుదల చేసిన నిధులను సైతం దారి మళ్లిస్తోందన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులను ఆగౌరవపరస్తూ చట్టాలను తుంగలోకి తొక్కుతోందన్నారు. 15వ ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధులు రూ.1150 కోట్లు స్థానిక సంస్థలకు వెంటనే జమచేయాలని డిమాండ్ చేశారు. బిల్లుల చెల్లింపులో రాజకీయ జోక్యం నివారించాలని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 73, 74, సవరణల మేరకు సర్పంచులకు ఉన్న అధికారాలను వర్తింపజేయాలని మాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు కొమ్మినేని రవిశంకర్ మాట్లాడుతూ 1320 మంది పంచాయతీ సెక్రటరీలకు తక్షణమే పోస్టింగ్స్ ఇచ్చి పెండింగ్‌లో ఉన్న 9 నెలల జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్‌లందరికీ తల్లికి వందనం పథకంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు గౌరవ వేతనాలు వెంటనే పెంచాలని, సకాలంలో చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా పంచాయతీరాజ్ విభాగం ప్రతినిధులు పి.రమేష్, వి.వెంకట నారాయణరెడ్డి, సీహెచ్ బుచ్చిరెడ్డి, జె.ప్రేమ్‌రాజ్, సీహెచ్ రమేష్, సీహెచ్ వేమనరావు, బండారు ఆంజనేయులు, జి.అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీరాజ్ వ్యవస్థను కాపాడాలి
జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం
అందజేసిన వైఎస్సార్ సీపీ
పంచాయతీరాజ్ విభాగం