
మానసిక నిపుణుల అవసరం పెరిగింది
త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి
లబ్బీపేట (విజయవాడతూర్పు): ప్రస్తుత సమాజంలో జీవనశైలి, దురలవాట్ల కారణంగా మానసిక రుగ్మతలు పెరిగాయని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. అందువల్ల మానసిక నిపుణుల అవసరం కూడా సమాజంలో పెరిగిందన్నారు. విజయవాడలోని ఇండ్లాస్ హాస్పిటల్స్‌లో నూతనంగా ప్రవేశపెట్టిన ఎం.ఫిల్ క్లినికల్ సైకాలజీ, పీడీసీపీ కోర్సులను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో కలిసి ఆయన విజయవాడలో సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురికి ఆయా కోర్సుల్లో అడ్మిషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ మానసిక రుగ్మతలను సైతం ఆరోగ్య సమస్యలు గానే పరిగణించి చికిత్సనందించాలని సూచించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి అధ్యక్షతన నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి, మానసిక వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఇండ్లాస్ హాస్పిటల్స్ క్లినికల్ సైకాలజీ విభాగం డైరెక్టర్లు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, డాక్టర్ విశాల్ ఇండ్ల మాట్లాడుతూ మానసిక వైద్యాన్ని ప్రజలందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ పి.చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.