
సంక్షేమ బోర్డును అమలు చేసే వరకు పోరాటం
ఆటోనగర్(విజయవాడతూర్పు): కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు తగ్గాయి. వేతనాలు విపరీతంగా తగ్గాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ గౌవర అధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెన్సీ నగర్‌లోని ఓ ప్రయివేట్ కల్యాణ మండపంలో సోమవారం ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభ జరిగింది. ఈ సందర్భంగా పలువురు యూనియన్ నాయకులు మాట్లాడుతూ నిర్మాణరంగ సంక్షేమ బోర్డును అమలు చేయాలని, లేకుంటే పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఏ కూటమి సంక్షేమ బోర్డును అమలుచేస్తామని కార్మికులకు మాట ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక దానిని పూర్తిగా విస్మరించిందని దుయ్యబట్టారు. ప్రస్తుతం భవన నిర్మాణ పనులు తక్కువయ్యాయని, అపార్ట్‌మెంట్‌ల నిర్మాణాలు మాత్రమే జరుగుతున్నాయన్నారు. పెద్ద పెద్ద కన్‌స్ట్రక్షన్ వారంతా కార్మికులను ఒడిశా, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల వారితో పనులు చేయించుకుంటున్నారన్నారు. స్థానిక కార్మికులకు పనులు దొరకక కార్మిక కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి నెలకొని ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు పుట్టెపు అప్పారావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు, గౌరవ అధ్యక్షుడు డీవీ కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌వీ వెంకటేశ్వరరావు, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ కన్వీనర్ ఎ.కమల పాల్గొన్నారు.
ఎన్నికల హామీని తుంగలో
తొక్కిన కూటమి ప్రభుత్వం
వేతనాలు తగ్గాయి.. ధరలు పెరిగాయి
కార్మిక కుటుంబాలు వీధిన పడే ప్రమాదం
ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ 10వ జిల్లా మహాసభ
ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు