
నిధుల్లేక.. కొనలేక..!
పెడన: కూటమి పాలనలో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. నాడు టీడీపీ సర్కారులో తీవ్ర నిర్లక్ష్యానికి గురై గ్రామాలకు దూరంగా చెత్త సంపద కేంద్రాలను నిర్మించి వదిలేస్తే.. వీటి ద్వారా పంచాయతీకి ఆదాయం సమకూర్చేలా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మళ్లీ టీడీపీ వివిధ పార్టీలతో పొత్తుపెట్టుకుని అధికారం చేపట్టి చెత్త సంపద కేంద్రాలను నిర్వీర్యం చేయాలని చూస్తోంది. అందులో భాగంగా ప్రతి 250 ఇళ్లకు ఒక క్లాప్ మిత్రను, ఒక రిక్షాను పంచాయతీలే కొనుగోలు చేసి ఏర్పాటు చేసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించాలని, అవసరమైన రిక్షాలు కొనుగోలు చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. పంచాయతీ నిధులు అంతంత మాత్రంగా ఉన్న వాటితో ఎలా వీటిని కొనుగోలు చేయాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పంచాయతీలకు భారం
పెడన నియోజకవర్గం పరిధిలో అధిక శాతం పంచాయతీలకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. పంచాయతీలన్నింటికి ఆర్థిక సంఘం నిధులే ఆధారం. ప్రతి 250 కుటుంబాలకు ఒక రిక్షా, క్లాస్ మిత్ర ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇలా చేయాలంటే జనాభా ప్రాతిపదిక కనీసం ఒక్కో పంచాయతీకి మూడు నుంచి పది రిక్షాలు వరకు కొనుగోలు చేయాలి. ఒక రిక్షా ఖరీదు రూ.25 వేల నుంచి రూ.30 వేలకు వరకు ఉందని, వాటిని ఎలా కొనుగోలు చేయాలంటూ పంచాయతీ సిబ్బంది వాపోతున్నారు. గతంలో కొనుగోలు చేసిన వాటికి మరమతులు చేయించాలంటేనే రూ.10వేలు వరకు ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆదాయం లేని పంచాయతీలే అధికం
నియోజకవర్గంలోని ఆయా మండలాల్లోని చాలా పంచాయతీలకు ఆదాయం రావడం లేదు. ఆస్తి పన్నులు, నీటి కుళాయిల ద్వారా వచ్చే పన్నులు అంతంత మాత్రమే. వీటితో నెలవారి ఖర్చులకు కూడా సరిపోని దుస్థితి. పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను ఇలా నాలుగు మండలాల్లో కూడా చాలా పంచాయతీల్లో రూ.2లక్షలు కూడా ఆదాయం రానివి ఉన్నాయి. ఆదాయం లేని పంచాయతీలను గుర్తించి ప్రభుత్వమే రిక్షాలు అందించేలా చర్యలు తీసుకోవాలని సర్పంచులు, కార్యదర్శులు కోరుతున్నారు. కొందరు క్లాప్‌మిత్రలు పనిచేస్తూ మానేస్తున్నారు. పంచాయతీల పరిధి ఎక్కువగా ఉండటంతో పాటు తిరగలేక, జీతాలు సరిగ్గా సరిపోక ఇబ్బందులు పడుతూ మానేస్తున్నారు. కొత్త వారిని తీసుకుందామంటే ముందుకు రాని దుస్థితి.
గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై నీలినీడలు రిక్షాలు కొనుగోలు చేయాలని ప్రభుత్వ ఆదేశం ప్రతి 250 ఇళ్లకు ఒక క్లాప్‌మిత్ర..ఒక రిక్షా అంతంత మాత్రం పంచాయతీల ఆదాయం
పెడన నియోజకవర్గంలో పంచాయతీలు...సంపద కేంద్రాలు
మండలం పంచాయతీలు సంపద
కేంద్రాలు
పెడన 24 24
గూడూరు 27 26
బంటుమిల్లి 21 21
కృత్తివెన్ను 16 16

నిధుల్లేక.. కొనలేక..!