
విదేశీ విహంగాల సందడి
వెంకటాపురం(పెనుగంచిప్రోలు): పెనుగంచిప్రోలు మండలంలోని వెంకటాపురంలో విదేశీ విహంగాలు సందడి చేస్తున్నాయి. వెంకటాపురం విదేశీ పక్షుల విడిదిగా మారింది. ఏటా వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆస్ట్రేలియా నుంచి పెయింటెడ్ స్టాక్స్(ఎర్రకాళ్ల కొంగలు) డిసెంబర్‌లో గ్రామానికి వచ్చి విడిది చేస్తాయి. వందల సంఖ్యలో వచ్చిన పక్షులు సంతానోత్పత్తి తర్వాత జూన్‌లో వాటి స్వస్థలాలకు వెళ్తుంటాయి. గ్రామస్తులు కూడా వీటిని సొంత బిడ్డల్లా చూసుకుంటారు. ప్రస్తుతం కొన్ని పక్షులు వాటి స్వస్థలాలకు వెళ్తున్నాయని గ్రామస్తులు అంటున్నారు.
పక్షుల కోలాహలం
గ్రామంలో ఎక్కడ చూసినా పక్షుల కోలాహలం కనిపిస్తోంది. వందల సంఖ్యలో వచ్చిన పక్షులు నేడు సంతానోత్పత్తి చేయడంతో వేల సంఖ్యకు చేరాయి. ఇవి చేసే అరుపులు, ధ్వనులతో కోలాహలం సృష్టిస్తున్నాయి. గ్రామస్తులు వాటిని కాపాడుకుంటున్నారు. పక్షుల పిల్లలు గ్రామస్తులతో పాటు కింద తిరుగుతూ వారితో కలిసి పోతున్నాయి. ఇళ్ల మీద, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ సందడి చేస్తున్నాయి.
నీటి కుంట అభివృద్ధి చేస్తే..
దశాబ్దాల నుంచి తమ గ్రామానికి బంధువుల మాదిరి ఏటా వస్తున్న పక్షులను తమ సొంత పిల్లల మాదిరి, పుట్టింటికి వచ్చిన బిడ్డల్లా చూసుకుంటున్నారు. వీటికి గ్రామంలోని నీటికుంట తాగునీటి అవసరాన్ని తీరుస్తోంది. ఎకరం 80 సెంట్లు ఉన్న ఈ కుంటను ఊర చెరువుగా అభి వృద్ధి చేస్తే పక్షులకు తాగునీటి ఇబ్బందులు తొలగడంతో పాటు గ్రామంలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయి. కుంటలో వర్షం నీరు లేకపోయినా మునేరు ఎత్తిపోతల పథకం నుంచి నీటిని నింపవచ్చు. గతంలో ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి కూడా నీటిని కుంటలోకి వదిలారు. ప్రస్తుతం నీటి కుంట మొత్తం కంపచెట్లతో నిండి పోయి ఉంది. దీంతో పక్షులు గ్రామంలోని వాటర్ ట్యాంక్ వద్ద నీటి కోసం వస్తున్నాయి.
వెంకటాపురంలో కోలాహలం నీటికుంటను అభివృద్ధి చేయాలంటున్న గ్రామస్తులు
రక్షణ చర్యలు చేపడతాం
గ్రామంలో విదేశీ పక్షుల రక్షణకు చర్యలు చేపడతాం. గ్రామస్తులు వీటిని తమ సొంత బిడ్డల్లా చూసుకోవడం ముచ్చటేస్తోంది. ప్రస్తుతం గ్రామంలో వేల సంఖ్యలో పక్షులు సందడి చేస్తున్నాయి. వీటి తాగునీటికి అవసరమైన నీటికుంట అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం.
–మార్కపూడి గాంధీ, ఎంపీపీ

విదేశీ విహంగాల సందడి

విదేశీ విహంగాల సందడి

విదేశీ విహంగాల సందడి