
మిద్దె తోటల కూరగాయలతో ఆరోగ్యం
భవానీపురం(విజయవాడపశ్చిమ): వంటింటి వ్యర్థాలతో తయారు చేసిన సేంద్రియ ఎరువుతో మిద్దె తోటల్లో కూరగాయలు, ఆకుకూరలను పండిస్తే పర్యావరణ పరిరక్షణతోపాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చని పలువురు వక్తలు పేర్కొన్నారు. వన్ ఎర్త్ – వన్ లైఫ్ (టెర్రస్ గార్డెన్ గ్రూప్) ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కళాక్షేత్రం ప్రాంగణంలో రైతులు ప్రదర్శించిన దేశవాళీ విత్తనాలు, ప్రకృతి వ్యవసాయం, ఔషధ మొక్కల స్టాల్స్‌ను కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తిలకించారు. మిద్దె తోటల అభివృద్ధికి సహకారం అందిస్తానని తెలిపారు. జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ సతీష్ మాట్లాడుతూ నగరాల్లో మిద్దె తోటల పెంపకం ప్రాధాన్యం పెరిగిందని, దీంతో జీవ వైవిధ్యం మెరుగుపడుతుందన్నారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ టెర్రస్ గార్డెన్‌లో పెరిగిన కూరగాయలు శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడతాయని పేర్కొన్నారు. రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కొత్తగా మిద్దె తోటలను ప్రారంభించానుకునేవారికి చీడపీడల నివారణ పద్ధతులతో పాటు ఇతర మెలకువలను తెలియజేస్తామని చెప్పారు. పర్యావరణవేత్త కొమెర అంకారావు (జాజి) మాట్లాడుతూ సేంద్రియ ఎరువుతో పండించే ఆకుకూరల్లో ఉండే ఔషధ గుణాలను వివరించారు. వన్ ఎర్త్ – వన్ లైఫ్ (మిద్దె తోట వాట్సప్ గ్రూప్) వ్యవస్థాపకురాలు ఏలూరి లీలా కుమారి మాట్లాడుతూ రసాయనాలతో తయారు చేసిన పురుగుల మందులతో పండించినవి ఏవైనా ఆరోగ్యానికి హానికరమని, ఈ సమస్యకు సమర్థమైన ప్రత్యామ్నాయం మిద్దె తోటల పెంపకమేనన్నారు. తొలుత విద్యార్థులకు పర్యావరణం, వన్ ఎర్త్–వన్ లైఫ్ అంశాలపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేశారు.

మిద్దె తోటల కూరగాయలతో ఆరోగ్యం