
విద్యుదాఘాతంతో బాలుడి మృతి
వించిపేట(విజయవాడపశ్చిమ): విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి చెందిన ఘటన పశ్చిమ నియోజవర్గం 50వ డివిజన్‌లోని గొల్లపాలెంగట్టు కొండ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం తమ్మా లలిత కూలి పనులు చేసుకుంటూ జెండా చెట్టు సెంటర్‌లోని కొండప్రాంతంలో నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆమె చిన్న కుమారుడు తమ్మా మానస్(8) ఆదివారం మధ్యాహం ఇంటి సమీపంలో ఆడుకుంటున్న క్రమంలో అక్కడ ఉన్న ఒక బడ్డీ కొట్టును పట్టుకొన్నాడు. దీంతో అతనికి విద్యుత్ షాక్ తగిలింది. కాలిన గాయాలతో అపస్మారక స్థితిలో పడిపోయాడు. దీన్ని గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు వెంటనే ఆటోలో నగరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతి చెందాడు. బడ్డీ కొట్టు నిర్వాహకులు సమీపంలోని తమ ఇంటి నుంచి.. ఇనుప రేకులతో ఏర్పాటు చేసిన కొట్టుకు విద్యుత్ సరఫరా ఏర్పాటు చేసుకున్నారు. ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు విద్యుత్ సరఫరా రేకులకు తాకడంతో బాలుడు ఆడుకుంటూ దాన్ని పట్టుకోవడంతో విద్యుత్ షాక్‌కు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటన విషయం తెలియడంతో స్థానిక కార్పొరేటర్ బోయి సత్యబాబు, వైఎస్సార్ సీపీ మహిళా నాయకురాలు బంకా చాముండేశ్వరి బాలుడి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఆడుకుంటూ బడ్డీకొట్టును తాకడంతో కరెంట్ షాక్