కదం తొక్కిన కలం | - | Sakshi
Sakshi News home page

కదం తొక్కిన కలం

May 9 2025 1:16 AM | Updated on May 9 2025 1:16 AM

కదం తొక్కిన కలం

కదం తొక్కిన కలం

పత్రికా స్వేచ్ఛను పరిహాసం చేస్తూ, ‘సాక్షి’ ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డి ఇంటిపై పోలీసుల దాడిని ఖండిస్తూ ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు కదం తొక్కారు. అక్షరంపై అక్కసు ఎందుకంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ తీరుతో పత్రికా స్వేచ్ఛకు పెను ప్రమాదం ఎదురవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును ముక్తకంఠంతో ఖండించారు. ‘సాక్షి’ ఎడిటర్‌ ఇంటిపై దాడి.. పత్రికా స్వేచ్ఛపై దాడి, ప్రజాస్వామ్యానికి సంకెళ్లు, ప్రజాస్వామ్యమా? పోలీసు రాజ్యమా?, పత్రికా స్వేచ్ఛపై దాడి సిగ్గు సిగ్గు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి.. అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌)/విజయవాడ స్పోర్ట్స్‌: నగరంలోని వెటర్నరీ కాలనీలో ఉన్న ‘సాక్షి’ ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డి నివాసంపై గురువారం ఉదయం పోలీసులు దాడి చేశారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, కనీసం సెర్చ్‌ వారెంట్‌ లేకుండానే పోలీసులు దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించారు. ధనంజయరెడ్డితో దురుసుగా ప్రవర్తించారు. ఎందుకు దాడి చేస్తున్నారని ప్రశ్నించినా సమాధానం ఇవ్వకుండా ఇష్టారా జ్యంగా ప్రవర్తించారు. ఈ సమాచారం తెలుసుకున్న జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు ఆందోళన బాటపట్టారు. విజయవాడలో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌కు చేరుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు.

పోలీసుల తీరు హేయం

తొలుత కలెక్టరేట్‌ ఎదురుగా బందరు రోడ్డు పక్కన జర్నలిస్టులు శాంతియుతంగా నిరసన తెలిపారు. అక్కడ నుంచి జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ చాంబర్‌కు చేరుకున్నారు. పోలీసుల దాడి ఘటనపై కలెక్టర్‌ లక్ష్మీశకు వినతి పత్రం అందజేశారు. ఎడిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కృష్ణంరాజు, సామ్నా ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ రమణారెడ్డి, ‘సాక్షి’ నెట్‌వర్క్‌ ఇన్‌చార్జి బి.వి.రాఘవరెడ్డి, బ్యూరో ఇన్‌చార్జి ఓ.వెంకట్రామిరెడ్డి కలెక్టర్‌ చాంబర్‌లో కలెక్టర్‌కు వినతి పత్రం అందించి ఘటన వివరాలను తెలియజేశారు. అనంతరం ఎడిటర్స్‌ అసోసియేషన్‌, ఆంధ్ర ప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు ఫెడరేషన్‌ (ఏపీయూడబ్ల్యూజేఎఫ్‌), ఏపీయూడబ్ల్యూజే, సామ్నా ప్రతిని ధులు నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఎడిటర్‌ ఇంటిపై పోలీసుల దాడి హేయమైన చర్య అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పత్రికా స్వేచ్ఛపై దాడులు పెరిగా యని ఆందోళన వ్యక్తంచేశారు. అత్యధికంగా దాడులు జరుగుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ రికార్డులకు ఎక్కిందని విమర్శించారు. ప్రజల గొంతుకై నిలిచిన ‘సాక్షి’ మీడియాను అణగదొక్కే ప్రయత్నాల్లో భాగమే ఎడిటర్‌ ధనంజయరెడ్డి ఇంటిపై దాడి అని స్పష్టంచేశారు. నిరసన ప్రదర్శనలో ‘సాక్షి’ అసోసియేట్‌ ఎడిటర్‌ పోతుకూరి శ్రీనివాస రావు, డీజీఎం అప్పన్న, క్లస్టర్‌ ఇన్‌చార్జి ఎన్‌.వెంకట రెడ్డి, విజయవాడ బ్రాంచ్‌ మేనేజర్‌ యశోద్‌రాజ్‌, స్టేట్‌ బ్యూరో రిపోర్టర్లు రాంగోపాల్‌రెడ్డి, ఇర్రింకి ఉమామహేశ్వరరావు, మాణిక్యాలరావు, ఫణి కుమార్‌, వరప్రసాద్‌, బోనం గణేష్‌, బాల శేఖర్‌, కిరణ్‌, ఫొటో జర్నలిస్టు రూబెన్‌, వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రవిచంద్ర, ఏపీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి. ఆంజనేయులు, జిల్లా అధ్యక్షుడు కలిమి శ్రీ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి ఎస్పీ కార్యాలయం వరకు జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్పీ ఆర్‌.గంగాధరరావుకు వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా పలు చోట్ల జర్నలిస్టులు కదం తొక్కారు. పోలీసుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. అనంతరం ఆయా చోట్ల ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు.

‘సాక్షి’ ఎడిటర్‌ ధనంజయరెడ్డి ఇంటిపై పోలీసుల దాడికి నిరసన పత్రికా స్వేచ్ఛపై ప్రభుత్వ తీరును ఎండగట్టిన జర్నలిస్టులు అధికారులు, కలెక్టర్‌కు వినతి పత్రాలు అందజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement