
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్లను ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఆది దంపతులైన దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. భక్తుల తాకిడితో అంతరాలయ దర్శనం నిలిపివేసిన ఆలయ అధికారులు, భక్తులకు బంగారు వాకిలి దర్శనం కల్పించారు. రూ.300, రూ.100 టికెట్లతో పాటు సర్వ దర్శనం క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం 6 గంటల నుంచే భక్తులతో క్యూలైన్లు నిండిపోగా, మహా మండపం వైపు నుంచి వచ్చే భక్తులను 5వ అంతస్తు వరకే లిఫ్టులో అనుమతించారు. అక్కడి నుంచి మెట్ల మార్గం ద్వారా భక్తులు కొండపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
తడిసి ముద్దయ్యారు..
ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఘాట్‌రోడ్డు మీదగా కొండపైకి చేరుకున్న భక్తులు వర్షంతో తడిసి ముద్దయ్యారు. వర్షం కురుస్తున్న తరుణంలో సర్వ దర్శనం క్యూలైన్‌లో ఉన్న భక్తులను టికెట్ల క్యూలైన్‌లోకి ఉచితంగా అనుమతించారు.
వర్షంతో తప్పని ఇబ్బందులు
ఘాట్‌రోడ్డు మూసివేత..
ఆదివారం ఉదయం 8 గంటలకు భారీ వర్షం కురవడంతో దుర్గగుడి ఘాట్‌రోడ్డును ఆలయ అధికారులు మూసివేశారు. సుమారు గంట పాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో కొండ రాళ్లు విరిగిపడే ప్రమాదం ఉందని దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులు భావించారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఘాట్‌రోడ్డుపైకి ఎటువంటి వాహనాలను అనుమతించలేదు. ఉదయం 11గంటల తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడం, భక్తుల తాకిడి అనూహ్యంగా పెరగడంతో ఘాట్‌రోడ్డుపైకి దేవస్థాన బస్సులతో పాటు ద్విచక్ర వాహనాలను అనుమతించారు. సాయంత్రం వరకు దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.