సాక్షి ప్రతినిధి, విజయవాడ: తిరువూరులో నియోజకవర్గ ప్రజాప్రతినిధి, పార్లమెంట్ ప్రజాప్రతినిధి ఇద్దరూ తోడు దొంగలై దోచుకున్నారు. అవినీతికి కాదేదీ అనర్హం అన్నట్లు రూ.కోట్లు వెనకేసుకున్నారు. వాటాల్లో తేడా రావడంతో విడిపోయి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలి ఒకరిపై మరొకరు రాజకీయ ఎత్తులు వేసుకుంటూ కాలయాపన చేశారు. ఇలా కొన్ని నెలలుగా తిరువూరు నియోజకవర్గ అధికార పార్టీలో జరుగుతున్న రాజకీయ చదరంగంలో పార్లమెంట్ నియోజకవర్గ ప్రజాప్రతినిధిదే పైచేయిగా నిలిచింది. నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఒంటరిగా మిగిలారు. నోటి దురుసు తనం, ఆవేశమే ఆయనకు శాపంగా మారాయి. దానిని ఓ సామాజికవర్గం తమకు అనుకూలంగా మార్చుకుని ఆధిపత్య పోరులో దళిత ప్రజాప్రతినిధిపై ఫిర్యాదులు చేస్తూ, అధిష్టానం వద్ద పై చేయి సాధించింది. ప్రస్తుతం టీడీపీ అధిష్టానం సైతం ఆచితూచి అడుగులు వేస్తూ, ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోకుండా గుమ్మనంగా వ్యవహరిస్తోంది. పొమ్మనకుండా పొగబెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
పార్లమెంట్
ప్రజాప్రతినిధిదేపై చేయి
అక్రమ దందా వాటాల్లో తేడా వచ్చిన నాటి నుంచి నియోజకవర్గ ప్రజాప్రతినిధిపై పార్లమెంట్ ప్రజాప్రతినిధి వేసిన రాజకీయ ఎత్తుగడలు ఫలించాయి. పక్కా ప్రణాళిక ప్రకారం నియోజకవర్గ ప్రజాప్రతినిధికి వ్యతిరేకంగా ఉన్న నాయకులందరినీ పార్లమెంట్ ప్రజాప్రతినిధి ఏకతాటిపైకి తీసుకొచ్చి అధిష్టానానికి ఫిర్యాదు చేయించారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఒంటెద్దు పోకడలను ఆది నుంచి గమనిస్తున్న అధిష్టానం సైతం ఆయనపై చర్యలకు ఉపక్రమించింది. జిల్లా సీనియర్ నాయకులతో చర్చలు జరిపి నియోజకవర్గ ప్రజాప్రతినిధిని పక్కన పెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇదే క్రమంలో పార్లమెంట్ ప్రజాప్రతినిధి తిరువూరు రాజకీయాల్లో చక్రం తిప్పడం ప్రారంభించారు. తిరువూరు మార్కెట్ యార్డు చైర్మన్ పదవి నుంచి డైరెక్టర్ పోస్టుల వరకు తన వర్గీయులనే ఎంపిక చేయించారు. ఈ నెల ఐదో తేదీన జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా నియోజకవర్గ ప్రజాప్రతినిధి వెంట నాయకులెవరూ వెళ్లకుండా చేయడంలో పార్లమెంట్ ప్రజాప్రతినిధి విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తిరువూరు ఎమ్మెల్యే సీటును ఆశించి భంగపడిన సేవల దేవదత్‌ను తెరమీదకు తీసుకొచ్చి ఆయన నాయకత్వంలోనే తాము పని చేస్తామంటూ తిరువూరు నియోజకవర్గ ప్రముఖ టీడీపీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేయించారు. ఈ సమాచారాన్ని సైతం అధిస్టానానికి చేరవేసిన పార్లమెంట్ ప్రజాప్రతినిధి సేవల దేవదత్‌ను తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా ప్రకటించేందుకు వ్యూహం పన్నారు.
బాబు సమక్షంలో అవమానం
క్లైమాక్స్‌కు చేరిన తిరువూరు రాజకీయ చదరంగం వర్గపోరులో పంతం నెగ్గించుకున్న పార్లమెంట్ ప్రజాప్రతినిధి ఆయన వర్గీయులకే మార్కెట్‌యార్డు పదవులు నియోజకవర్గ దళిత ప్రజాప్రతినిధికి అడుగడుగునా అవమానాలు ఆ ప్రజాప్రతినిధిని పక్కనబెట్టి కొత్త ఇన్‌చార్జిని ప్రకటిస్తారని ప్రచారం పార్లమెంట్ ప్రజాప్రతినిధిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దళిత సంఘాలు
ఈ నెల ఐదో తేదీన నందిగామ వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు స్వాగతం పలికే క్రమంలో తిరువూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధికి అవమానం జరిగిందని దళిత సంఘా లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబుకు ఎదురుగా వెళ్లిన నియోజకవర్గ ప్రజాప్రతినిధి గులాబీపువ్వు ఇచ్చి స్వాగతం పలికేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన్ను చంద్రబాబు పట్టించుకోకుండా పక్కన ఉన్న నాయకులతో ఫొటోలు దిగుతున్న వీడియోను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ఇదేనా దళిత ప్రజాప్రతినిధికి ఇచ్చే గౌరవం అని విమర్శిస్తున్నారు. దళిత ప్రజాప్రతినిధిపై అగ్రకుల పార్లమెంట్ ప్రజాప్రతినిధి పంతం నెగ్గించుకుని రాక్షసానందం పొందుతున్నారని దళిత సంఘాలు మండిపడుతున్నాయి.
దళిత ప్రజాప్రతినిధికి సెగ..
దళిత ప్రజాప్రతినిధికి సెగ..