విద్యార్థుల కెరీర్ దిశా నిర్దేశానికి కెరీర్ ఎక్స్పో
మచిలీపట్నంఅర్బన్: విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడంతో పాటు వారి కెరీర్‌పై అవగాహన కల్పించేందుకు కెరీర్ ఎక్స్పో వంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆర్.కుముదిని సింగ్ తెలిపారు. ఎస్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో శనివారం స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో జిల్లా స్థాయి కెరీర్ ఎక్స్పో–ఎగ్జిబిషన్ నిర్వహించారు. కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి యు.వి.సుబ్బారావు, అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కుముదిని సింగ్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా కుముదిని సింగ్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ కెరీర్‌కు సరైన దిశానిర్దేశం చేయాలనే లక్ష్యంతో ఈ ఎక్స్పో నిర్వహించినట్లు తెలిపారు. ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు 193 ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన కెరీర్ ఎక్స్పో ల నుంచి మండల స్థాయిలో ఎంపి కై న 125 పాఠశాలల ఐదు ఉత్తమ కెరీర్ మోడల్స్‌ను జిల్లా స్థాయిలో ప్రదర్శించినట్లు చెప్పారు. విద్య, విజ్ఞానం, సాంకేతికత, వృత్తి అవకాశాలకు సంబంధించిన వివిధ ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించి వివరణ ఇచ్చారన్నారు. విద్యార్థులు తమ ప్రదర్శనలతో వివిధ రంగాల్లో ఉన్న ప్రొఫెషనల్ అవకాశాలను స్పష్టంగా వివరించారని, ప్రాజెక్టులలో వారు చూపిన అవగాహన, ఆత్మవిశ్వాసం అభినందనీయమని ఆమె ప్రశంసించారు. ఎంపికై న మొదటి మూడు ఉత్తమ ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటాయన్నారు. ఉత్తమ ప్రాజెక్టులు ప్రదర్శించిన తొమ్మిది జట్లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ జోనల్ మేనేజర్ ఆర్.వి. హనుమంతరావు, కొటక్ మహీంద్రా బీఎం సుధీర్ కుమార్, వైజాగ్ పాలిటెక్నిక్ కాలేజ్ మెకానికల్ ట్రేడ్ లెక్చరర్ డాక్టర్ టి.నాంచారయ్య, ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్‌వేర్ ట్రేడ్ లెక్చరర్ డాక్టర్ సయ్యద్ సదాత్ అలీ, జీసీడీఓ సీతామహాలక్ష్మి, సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


