సిద్ధార్థలో ఘనంగా వైట్ కోట్ వేడుకలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని, సమాజంలో సేవలు అందించే అవకాశం వైద్యులకే ఉంటుందని మాజీ ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ యలమంచిలి రాజారావు అన్నారు. విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో 2025–26 బ్యాచ్‌లో అడ్మిషన్ పొందిన వైద్య విద్యార్థులకు వైట్‌కోట్ అందించే వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో విద్యార్థులతో పాటు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. డాక్టర్ రాజారావు మాట్లాడుతూ.. ఎంత కష్టపడి వైద్యవిద్యలో సీటు సాధించారో, అదే పట్టుదలతో కోర్సును పూర్తి చేయాలన్నారు. మరో అతిథి ఎన్టీఆర్ జిల్లా డీఎంహెచ్‌ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని మాట్లాడుతూ.. మంచి వైద్యులుగా ఎదిగేందుకు ప్రతి ఒక్కరూ నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్, ఏడీఎంఈ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు వైట్ కోట్ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం విద్యార్థులకు వైట్‌కోట్‌లు, ఐడీ కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో 2024 బ్యాచ్ విద్యార్థులు, వైస్ ప్రిన్సిపాళ్లు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.


