
శృంగేరి శివగంగ పీఠాధిపతులకు స్వాగతం పలుకుతున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వేదపండితులు
శృంగేరీ శివగంగ పీఠాధిపతులు పురుషోత్తమ భారతీ మహాస్వామి
విజయవాడ కల్చరల్: వేద సంస్కృతిని పరిరక్షించుకోవాలని భారతీయ సనాతన ధర్మం విశిష్టమైందని శృంగేరి శివగంగ పీఠాధిపతులు పురుషోత్తమ భారతీ స్వామి అన్నారు. విజయయాత్రలో భాగంగా గురువారం శివరామకృష్ణ క్షేత్రంలో స్వామి విడిది చేశారు. భక్తులను ఉద్దేశించి స్వామి అనుగ్రహ భాషణ చేశారు. స్వామిజీ మాట్లాడుతూ జగద్గురువులు ఆదిశంకరులు ధర్మరక్షణ కోసం నాలుగు పీఠాలను స్థాపించారని అందులో ప్రధాన మైనది శృంగేరీ శారదాపీఠమని దానికి అనుబంధంగా శివగంగ పీఠం నడుపబడుతోందన్నారు. ఆదిశంకర చౌక్ నుంచి శివరామకృష్ణ క్షేత్రం వరకు నిర్వహించిన విజయయాత్రకు మల్లాది విష్ణు నాయకత్వం వహించి వేదపండితులతో ఘనంగా స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలలో భక్తిభావం పెంపోందించడానికి ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శివరామకృష్ణ క్షేత్రంలో ఉపాలయాలలో స్వామి ప్రత్యేక పూజలు, గోపూజ నిర్వహించారు. శివరామకృష్ణ క్షేత్రం ధర్మాధికారి శిష్ట్యాల హనుమత్ ప్రసాద్ మాట్లాడుతూ స్వామి 7వ తేదీ వరకు నగరంలో ఉంటారని ప్రతి రోజూ శారదా చంద్రమౌళీశ్వర్లుకు పూజలు నిర్వహిస్తారని భక్తులు ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరారు.