క్రీడా సంఘాల ప్రక్షాళన

- - Sakshi

సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో గత కొన్ని దశాబ్దాలుగా రెండు వర్గాలుగా విడిపోయిన క్రీడా సంఘాల నాయకులు ఒక తరం క్రీడాకారుల జీవితాలను నాశనం చేశారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కొందరు స్వార్ధపరులు క్రీడా సంఘాల్లోకి చొరబడి క్రీడలను వ్యాపారంగా మార్చారనేది సీనియర్‌ క్రీడాకారుల అభిప్రాయం. ఇందువల్ల క్రీడా నైపుణ్యం ఉన్న వారు ఎందరో మరుగున పడ్డారని ఆరోపణ. క్రీడలను వ్యాపారం చేయడమే కాకుండా అదేమిటని అడిగిన వ్యక్తులపై దాడులు చేయడం ఇక్కడ పరిపాటిగా మారింది. ప్రభుత్వ యంత్రాంగాలతో పాటు క్రీడా ప్రాధికార సంస్థను సైతం బెదిరింపులకు గురి చేసి వారి పబ్బం గడుపుకోవడం గత దశాబ్దంన్నర కాలంగా జరుగుతూ వస్తోంది. ఈ గడ్డు పరిస్థితులు ఉన్న కారణంగానే క్రీడా సంఘాల ప్రతినిధుల జోలికి వెళ్లే సాహసం గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు. దీంతో క్రీడలు పూర్తిగా స్వార్ధపరులైన క్రీడా సంఘాల ప్రతినిధుల చేతుల్లో కీలుబొమ్మగా మారాయి.

తొలి అడుగు

రాష్ట్రం విడిపోయిన తరువాత విజయవాడ కేంద్రంగా ఏర్పడిన కొన్ని క్రీడా సంఘాలు మూకుమ్మడిగా ధనార్జనపై పడ్డాయి. క్రీడలను పట్టి పీడిస్తున్న వ్యక్తులు ఎవరో తెలిసినా గత ప్రభుత్వం సంఘాల ముసుగులో ఏర్పడిన మాఫియాను కదిలించే ధైర్యం చేయలేక పోయింది. అయితే గడిచిన ఏడాది కాలంలో క్రీడాకారుల నుంచి వస్తున్న ఫిర్యాదు నేపథ్యంలో క్రీడలను ప్రక్షాళన చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే రెండేసి సంఘాలున్న క్రీడలను ప్రభుత్వం గుర్తించింది. సాధారణంగా ఒక క్రీడా సంఘం సర్వసభ్య సమావేశమే రణరంగాన్ని తలపిస్తుంది. ఇటీవల ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల ఫుట్‌బాల్‌ సంఘ ఎన్నికలు దీనికి నిదర్శనం. సభ్యుల పరస్పర వాగ్వాదాలతో నెలకొన్న అశాంతి పోలీసుల రంగ ప్రవేశంతోనే సద్దుమణిగింది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో అన్ని సంఘాలను ఒక చోటకు చేర్చి క్రీడాకారుల ఇబ్బందులను తెలుసుకునే ప్రయత్నం మంత్రి రోజా, శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి చేశారు. మంత్రి రోజా వేసిన ముందడుగు ఆమె ధైర్యానికి ప్రతీక అని కొందరు సీనియర్‌ క్రీడాకారులు మెచ్చుకుంటున్నారు. ఇది మార్పుకు సంకేతమని అభివర్ణిస్తున్నారు.

క్రీడా సంఘాల్లో హర్షాతిరేకాలు

గడిచిన 15 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయని సాహసం ప్రస్తుత ప్రభుత్వం చేయడంపై పలువురు క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకే వేదికపై అందరి సమస్యలను వినడం వల్ల ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు సమస్యల తీవ్ర రూపం తెలుస్తుందని చెబుతున్నారు. సమస్యలను వినడంతో పాటు అక్కడికక్కడే కొన్ని సమస్యలను పరిష్కరించిన తీరుపై కృతజ్ఞతలు చెబుతున్నారు. స్పోర్ట్స్‌ పాలసీ, జీవో నంబర్‌ 74, వైఎస్సార్‌ క్రీడా ప్రోత్సాహాల సమస్యలపై మంత్రి రోజా వెంటనే స్పందించి పరిష్కరించిన తీరును ప్రశంసిస్తున్నారు. రాష్ట్రంలో క్రీడలు అభివృద్ధి చెందేందుకు నాంది పడిందనే భావన క్రీడాకారుల్లో నెలకొంది.

శాప్‌, క్రీడా సంఘాల సమావేశంతో శుభ సంకేతాలు దీర్ఘకాలికంగా క్రీడా సంఘాల్లో విభేదాలను తొలగించే దిశగా అడుగులు క్రీడలను వ్యాపారంగా మార్చి దోచుకున్న వ్యక్తులను గుర్తించే పనిలో అధికారులు అందుకు కారణమైన వ్యక్తులపై చర్యలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం

రాష్ట్రంలో క్రీడాభివృద్ధి సాధించి తీరుతాం

రాష్ట్రంలో క్రీడాభివృద్ధి సాధించేందుకు వీలుగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. విజయవాడలో అన్ని క్రీడా సంఘాలతో సమావేశం ఏర్పాటుచేసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నాం. క్రీడాకారుల భవిష్యత్తు దృష్ట్యా అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశాం. విద్య, ఉపాధి అవకాశాల్లో ఎస్సీ, ఎస్టీలతో పాటు ఈబీసీ, విభిన్న ప్రతిభావంతులకు రెండు శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నాం. కోచ్‌ల నియామకాలు చేపట్టి మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇస్తున్నాం. నవంబర్‌లో జరిగే జాతీయ క్రీడలను దృష్టిలో పెట్టుకుని మే నెల నుంచే కోచింగ్‌ క్యాంప్‌లను నిర్వహిస్తాం.

– ఆర్‌.కె.రోజా, రాష్ట్ర మంత్రి

Read latest NTR News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top