NATA Convention 2023; NATA Grand Convention On June 30, July 1 And 2 - Sakshi
Sakshi News home page

Jun 16 2023 7:38 PM | Updated on Jun 17 2023 6:36 PM

NATA Grand Convention on June 30, July 1 and 2 - Sakshi

(అమెరికా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
టెక్సాస్‌ : అమెరికాలోని డాలస్‌ నగరంలో జూన్‌ 30 నుంచి జులై 2వ తేదీ వరకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాటా) మహాసభలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్లు నిర్వహణ కమిటీ తెలిపింది. ప్రవాసాంధ్రులు అత్యధికంగా ఉండే డాలస్‌లో ఈ వేడుకలు జరగనుండడం.. మరింత ఊపు తెచ్చింది. 


(NATA నాటా కార్యవర్గ బృందం)

కనివినీ ఎరుగని రీతిలో సభలు
అమెరికా చరిత్రలోనే అత్యంత ఘనంగా ఈ తెలుగు ప్రపంచ మహాసభలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది కమిటీ. ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు, నాయకులు, కళాకారులు హాజరు కానున్నారు. ఈ మహాసభల్లో తెలుగు సంప్రదాయాలను, కళలను అద్భుతమైన రీతిలో ప్రదర్శించడానికి అత్యున్నతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు నాటా అధ్యక్షుడు కొర్సపాటి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. కాబోయే అధ్యక్షుడు హరి వేల్కూర్‌, పూర్వాధ్యక్షుడు గోసాల రాఘవరెడ్డి, కార్యదర్శి గండ్ర నారాయణరెడ్డి, సాంస్కృతిక కార్యక్రమాల కమిటీ అధ్యక్షుడు నాగిరెడ్డి దర్గారెడ్డి తమవంతుగా వేడుకల కోసం కృషి చేస్తున్నారు.


(ఇటీవల ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ను కలిసిన NATA బృందం)

నాయకులకు వెల్‌కం
అంగరంగ వైభవంగా జరిపేందుకు తలపెట్టిన ఈ మహా వేడుకలకు సంబంధించి ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను కలిసింది నాటా బృందం. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ను సన్మానించిన నాటా సభ్యులు.. మహాసభలకు సంబంధించిన విశేషాలను పంచుకుని ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఇక ఈ వేడుకలకు పలువురు ప్రముఖులు, రెండు రాష్ట్రాల నుంచి రాజకీయ నాయకులు హాజరు కానున్నారు. 

సినిమా సందడే సందడి
నాటా తెలుగు మహాసభల్లో టాలీవుడ్‌ సందడి కనిపించనుంది. స్పెషల్‌ అట్రాక్షన్‌గా రాంగోపాల్‌ వర్మ, బెస్ట్‌ మ్యూజిక్‌ ట్రయో దేవీ శ్రీ ప్రసాద్‌, థమన్‌, అనూప్‌ రూబెన్స్‌, అలాగే గేయ రచయిత అనంత శ్రీరాం, సింగర్‌ ఎస్పీ శైలజ, మధు ప్రియ తదితరులు హాజరు కానున్నారు. సినీ ప్రముఖులు శ్రీనివాసరెడ్డి, అలీ, లయ గోర్తి, పూజ ఝువాల్కర్‌, స్పందన పల్లి, అనసూయ, ఉదయభాను, రవి, రోషన్‌, రవళి తదితర ప్రముఖులతో ఈ వేడుకల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రముఖ దుస్తుల డిజైనర్‌ శ్రావణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఫ్యాషన్‌షో, సినీ నృత్య దర్శకురాలు అనీ మాస్టర్‌ పర్యవేక్షణలో పిల్లల జానపద, సినీ నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు టీన్‌ నాటా, మిస్‌ నాటా, మిసెస్‌ నాటా పోటీలు కూడా జరగనున్నాయి. 

ధ్యాన సందేశం
ఈ వేడుకలకు ప్రత్యేక అతిథిగా ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ గురు రవిశంకర్‌ను ఆహ్వానించింది నాటా కార్యవర్గం. గురు రవిశంకర్‌తో ప్రత్యేకంగా ముచ్చటించే అవకాశాన్ని ప్రవాసాంధ్రులకు కల్పించింది. 

సూపర్‌ వెన్యూ డాలస్‌
డాలస్‌ అనగానే గుర్తొచ్చేది అమెరికాలో తెలుగు కాపిటల్‌ అని. అలాంటి చోట.. అది కూడా డౌన్‌టౌన్‌లో అందరికీ అనుకూలమైన K బెయిలీ హచిసన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (#KBHCCD)లో నాటా సభలు జరగనున్నాయి. పది లక్షల స్క్వేర్‌ ఫీట్‌ ఎగ్జిబిట్‌ స్పేస్‌, మూడు భారీ బాల్‌రూంలు, 88 మీటింగ్‌ రూంలు, ఒక భారీ థియేటర్‌ డాలస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ ప్రత్యేకతలు. 1957లో నిర్మించిన ఈ కన్వెన్షన్‌ను అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ వచ్చారు. 2013లో అమెరికా మాజీ సెనెటర్‌ K.బెయిలీ పేరును ఈ కన్వెన్షన్‌ సెంటర్‌కు పెట్టారు. 

అన్నింటికీ అనుకూలం
డాలస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ డౌన్‌ టౌన్‌లో ఉండడం వల్ల సులువుగా చేరుకోవచ్చు. ఈ కన్వెన్షన్‌లో భారీ పార్కింగ్‌ సెంటర్‌లున్నాయి. అన్నీ రకాల పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌తో అనుసంధానం అయి ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి అనుగుణంగా ఆమ్‌ట్రాక్‌, ట్రినిటీ రైల్వేలకు సమీపంలో ఉంది ఈ కన్వెన్షన్‌ సెంటర్‌. అలాగే కన్వెన్షన్‌తో నేరుగా స్కైవే బ్రిడ్జ్‌ ద్వారా కనెక్ట్‌ అయ్యేలా రెండు హోటళ్లు హయత్‌ రీజెన్సీ, షెరటాన్‌ హోటల్‌ ఉన్నాయి. 


(NATA వేడుకలు జరగనున్న డాలస్ కన్వెన్షన్)

మూడు రోజులు డాలస్‌కు పండగ కళ
జూన్‌ 30 శుక్రవారం ప్రారంభమయ్యే వేడుకలు.. జూలై 2 ఆదివారం వరకు జరుగుతాయి. శుక్రవారం సాయంత్రం అంగరంగ వైభవంగా బాంకెట్‌ డిన్నర్‌ ఏర్పాటు చేశారు, ఇక్కడ వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని నాటా ఎక్సలెన్స్‌ అవార్డులతో గుర్తించి సన్మానిస్తారు. ఇదే కార్యక్రమంలో అనూప్‌ రూబెన్స్‌ టీం సంగీత విభావరితో ఊర్రూతలూగించనున్నారు. జూలై 1, జులై2 రోజంతా సందడే సందడి. ఆట, పాట, మాట, మంతి.. ఒకటేంటి.. పండుగ వాతావరణంలో ప్రవాసాంధ్రులంతా ఒక్క చోట చేరి తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను అద్దం పట్టేలా వేడుకలు నిర్వహించనున్నారు. జులై 2న తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వరుడి కళ్యాణ వేడుక పద్మావతి అమ్మవారితో అంగరంగవైభవంగా జరగనుంది. మహాసభల ఏర్పాట్లను నాటా కార్యవర్గ సభ్యులు ఆర్య బొమ్మినేని, జయ తెలక్‌, మాధవి లోకిరెడ్డి, నంద కొర్వి, రేఖ కరణం, సుప్రియ టంగుటూరి, బ్రహ్మ బీరివెరా, హరి సూరిశెట్టి, సతీష్‌ సీరం, సలహాదారులు హరి వేల్కూర్‌, రామిరెడ్డి ఆళ్ల, ఉషారాణి చింత, సుజాత వెంపరాల ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకునే వారు నాటా వెబ్‌సైట్‌ https://nataconventions.org/conference-registration.php  లో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఎగ్జిబిషన్​లో స్టాల్స్ ఏర్పాటు చేసుకోవాలనుకునేవారు నాటా PR&మీడియా డీవీ కోటి రెడ్డి (9848011818)ని సంప్రదించాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement