నిజామాబాద్‌అర్బన్ : ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 23 వరకు టూరిజం వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో సోమవారం వా రోత్సవాల పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న పర్యాటక ప్రదేశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.సంస్కృతి, సంప్రదాయాల కు, చారిత్రక ప్రదేశాలకు జిల్లా నెలవన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 23 వరకు వారోత్సవాలు నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, డీఆర్డీవో సాయాగౌ డ్, జెడ్పీ సీఈవో సాయన్న పాల్గొన్నారు.
నిజామాబాద్ అర్బన్: రెడ్‌క్రాస్ సొసైటీ సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని చైర్‌పర్సన్, కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెడ్‌క్రాస్ సభ్యత్వ నమోదు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రెడ్‌క్రాస్ సంస్థ సమాజ సేవలో విశిష్ట పాత్ర పోషిస్తోందని, ముఖ్యంగా తలసేమియా బాధిత చిన్నారులకు నిరంతర రక్త మార్పిడి సేవలను అందిస్తూ అండగా నిలుస్తోందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు, సేవా సంస్థలు ముందుకు వచ్చి రెడ్‌క్రాస్ సభ్యత్వం తీసుకొని సేవా కార్యక్రమాలకు తోడ్పాటు అందించాలని కోరారు. సభ్యత్వ నమోదు కోసం www. redcross. cgg. gov. in వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు. కార్యక్రమంలో చైర్మన్ బుస్స ఆంజనేయులు, అదనపు కలెక్టర్లు కిరణ్‌కుమార్, దిలీప్‌కుమార్, డీఆర్వో గీత, డీఆర్డీవో సాయన్న, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డిప్యూటీ లేబర్ కమిషనర్ యాదయ్య, రెడ్‌క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి కరిపే రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
● ఐఐహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ గవర్నింగ్
కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ కవితారెడ్డి
సుభాష్‌నగర్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచడం సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఐఐహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ కవితారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తంచేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాక ఇంధన ధరలు పెంచడం రాజకీయ లబ్ధి కోసమే చేసిన కుట్ర అని ఆరోపించారు. డీజిల్, పెట్రోల్ ధరల పెంపుతో రవాణా చార్జీలు పెరిగి, దాని ప్రభావం నిత్యావసర సరుకుల ధరలపై పడుతుందని తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు సామాన్య ప్రజల పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డాక్టర్ కవితారెడ్డి కోరారు.
నిజామాబాద్ రూరల్ : జిల్లాను స్మార్ట్ సిటీగా ప్రకటించకపోవడంలో ఎంపీ అర్వింద్ విఫలమయ్యారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేష్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన మీడియాకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మూడు అగ్రికల్చర్ యూనివర్సిటీలు మంజూరు చేస్తే అందులో నిజామాబాద్ జిల్లాకు ఒకటి కేటాయించారన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పట్టుదల, కృషితోనే జిల్లాకు ఇంజినీరింగ్ కళాశాల, వ్యవసాయ కళాశాల వచ్చినట్లు పేర్కొన్నారు. బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి చొరవతో రూ.600 కోట్లతో మూడు యంగ్ ఇండియా స్కూళ్లు మంజూరైనట్లు గుర్తుచేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు 12 సంవత్సరాలలో జిల్లాకు ఏం తీసుకువచ్చారని ప్రశ్నించారు. ఎంపీగా అర్వింద్ నిజామాబాద్‌కు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని ఆరోపించారు. నిజామాబాద్ పార్లమెంటులో పరిధిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు పెండింగ్‌లో ఉన్నాయని విమర్శించారు.
డిచ్‌పల్లి: మండలంలోని నడిపల్లి గ్రామానికి చెందిన పంగెర గంగవ్వ (80) రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎస్సై మహమ్మద్ ఆరిఫ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 12న సాయంత్రం పింఛన్ డబ్బుల కోసం ఇంటి నుంచి పోస్టాఫీసుకు వెళ్తూ రోడ్డు దాటుతోంది. అదే సమయంలో డిచ్‌పల్లి నుంచి నిజామాబాద్ వైపు వెళుతున్న కారు అతివేగం, నిర్లక్ష్యంతో గంగవ్వను ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన గంగవ్వను జిల్లా కేంద్రంలోని ప్రగతి హాస్పిటల్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. మృతురాలి కుమారుడు పంగెర భూకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


