మూడు దశాబ్దాలుగా | - | Sakshi
Sakshi News home page

మూడు దశాబ్దాలుగా

May 17 2026 7:20 AM | Updated on May 17 2026 7:20 AM

శిక్షణ పొందినవారితో ఎంపీ అర్వింద్‌

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ఇందూరు నగరంలోని మాధవ స్మారక సేవాసమితి ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కార్యక్రమాలతో అనేకమంది వ్యక్తిత్వ వికాసం పొందుతుండడంతోపాటు నైపుణ్య అభివృద్ధి శిక్షణ పొందుతున్నారు. తద్వారా ఉపాధికి మార్గాలూ లభిస్తున్నాయి. ‘మానవసేవే మాధవ సేవ‘ అనే లక్ష్యంతో ముందుకెళ్తున్న ‘మాధవ స్మారక సేవాసమితి’ యువత కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా మహిళల స్వయం సమృద్ధి కోసం ఎక్కువగా పాటుపడుతోంది. ఇందులో భాగంగా వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులతోపాటు వివిధ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోంది. టైలరింగ్‌, జ్యూట్‌ బ్యాగుల తయారీ శిక్షణ, మెహందీ ఆర్ట్స్‌, ఎంబ్రాయిడరీ, బ్యూటీషియన్‌ విభాగాల్లో శిక్షణ ఇస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జ్యూట్‌ బ్యాగుల తయారీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్యార్థులు జ్యూట్‌ బ్యాగులు వాడేలా ప్రోత్సహిస్తున్నారు. ప్లాస్టిక్‌ వాడడం వల్ల తలెత్తే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. 1995 నుంచి వేలాదిమందికి వివిధ అంశాలు, విభాగాల్లో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి మార్గాలను చూపిస్తున్నారు. ముఖ్యంగా నిరుపేద, దిగువ మధ్యతరగతి వర్గాల మహిళలకు కుట్టు మిషన్‌, జ్యూట్‌ బ్యాగుల తయారీ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా బ్యూటీషియన్‌, మెహందీ డిజైన్‌ ఆర్‌ట్ప్‌, ఎంబ్రాయిడరీ శిక్షణ సైతం ఇస్తున్నారు. రెండు నుంచి మూడు నెలలపాటు ఒక్కో అంశంలో శిక్షణ నిర్వహిస్తున్నారు. విశేష నైపుణ్యం కలిగిన శిక్షకులతో ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలా శిక్షణ పొందిన పలువురు వివాహాది శుభకార్యాలకు ఆర్డర్లు తీసుకుని అలంకరణ రంగంలో ఉపాధి పొందుతున్నారు. ఇందులో పలువురు మహిళలు తాము ఉపాధి పొందుతుండడంతో పాటు పలువురికి ఉపాధి కల్పించే స్థాయి వరకు వెళ్లారు.

పర్యావరణ పరిరక్షణ

ప్లాస్టిక్‌ వాడకంతో కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తూ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా జ్యూట్‌ బ్యాగులను వినియోగాన్ని పెంచాలని ప్రచారం చేయడమే కాకుండా ఉచితంగా జ్యూట్‌ బ్యాగుల పంపిణీ సైతం చేస్తున్నారు.

పాఠశాల విద్యార్థులకు జ్యూట్‌ బ్యాగుల శిక్షణ (ఫైల్‌) శిక్షణ పొందుతున్న యువతులు, మహిళలు

సేవలు విస్తరిస్తాం

నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా నిలదొక్కుకునే సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని ఉచితంగా అందజేసేందుకే మాధవ స్మారక సేవాసమితి విశేషంగా కృషి చేస్తోంది. స్వయం శక్తితో సాధారణ కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా పూర్తిస్థాయిలో నిలదొక్కుకునేలాగా దోహదం చేస్తోంది. సమాజంలోని అన్ని రంగాల ప్రజలకు, యువతకు, మహిళలకు, పిల్లలకు వేర్వేరుగా సేవా కార్యక్రమాలను యోజన చేస్తూ అన్ని వర్గాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. భవిష్యత్‌లో మరిన్ని విశేష సేవా కార్యక్రమాలతో ముందుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. – మర్రి కృష్ణారెడ్డి, అధ్యక్షులు, మాధవస్మారక సేవా సమితి, ఇందూరు

‘మానవ సేవే మాధవ సేవ’ లక్ష్యంగా మాధవ స్మారక సేవాసమితి సేవలు

వ్యక్తిత్వ వికాసం, నైపుణ్య అభివృద్ధి

శిక్షణ కోసం నిరంతర కార్యక్రమాలు

కొవిడ్‌ విపత్తు వేళ సేవలు..

పర్యావరణ పరిరక్షణకు కృషి

Advertisement
 
Advertisement
Advertisement